ఎయిడ్స్ భాగస్వామి పరీక్షలపై ఎపిశాక్స్ ప్రత్యేక డ్రైవ్
ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల జీవిత భాగస్వాములిద్దరూ ఒకేసారి పరీక్ష చేయించుకోవాలి
దంపతుల్లో ఒకరికి హెచ్ఐవి నిర్ధారణ అయితే రెండోవారికి పరీక్ష తప్పనిసరి
పాజిటివ్ వున్న వారు ఎఆర్ టి మందులను వెంటనే ప్రారంభించాలి
నెగటివ్ వున్న భాగస్వాములు ‘ప్రెప్ ‘ మందుల్ని వాడాలి
ఎపిశాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఎస్.నవీన్ కుమార్
ఎయిడ్స్, హెచ్ఐవి నివారణా చర్యల్లో భాగంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల భాగస్వామి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపిశాక్స్) ప్రత్యేకడ్రైవ్ ను చేపట్టింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులైన జీవిత భాగస్వాములిద్దరికీ ఒకేసారి లేదా వీలయినంత త్వరగా భాగస్వాములిద్దరూ పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ , వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జి.ఎస్.నవీన్ కుమార్ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ పరీక్షలు వారి అంగీకారం మేరకే జరగాలని, అధికశాతం మంది ఈ విషయాన్ని అర్ధం చేసుకోకపోవటం వల్ల వెంటనే ముందుకు రావటంలేదని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు నుండి ఇప్పటి వరకూ పరీక్షలు చేయించుకోవటంలో కొంత మెరుగుదల కన్పిస్తోందన్నారు. వాస్తవానికి హెచ్ఐవి పరీక్షలు వ్యక్తుల యొక్క ప్రవర్తనా సరళిని బట్టి లేదా ఇతర శస్త్రచికిత్సలకు ముందు చేయించుకుంటారని ఆయన వివరించారు. ఒక వేళ దంపతుల్లో ఒకరికి హెచ్ఐవి వున్నట్లు నిర్ధారణ అయితే వారి భాగస్వామికి కూడా పరీక్ష చేయాల్సి వుంటుందన్నారు. ఇందులో చాలా మంది భయంతోనో, భాగస్వామికి తెలిస్తే ఎలా అర్ధం చేసుకుంటారోనన్న అనుమానంతోనో వారి హెచ్ఐవి పరిస్థితిని వెల్లడించకుండా గోప్యంగా వుంచుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. భాగస్వామికి హెచ్ఐవి వైరస్ సోకిందని చాలా మందికి తెలిసినా తనకేమీ కాదన్న అభిప్రాయంతో కొన్నేళ్ల పాటు పరీక్షలు చేయించుకోవటం లేదన్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తరువాత ఆసుపత్రికి రావటమో, అప్పటికే వారిలో వున్న వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా క్షీణించి త్వరగా మరణించటమో జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్రకారం భాగస్వాములిద్దరికీ ఒకేసారి కౌన్సెలింగ్ చేసి ఇద్దరికీ పరీక్ష చేయించినట్లయితే వారు పరస్పరం సహకరించుకుని ఎక్కువ కాలం జీవించటానికి అవకాశం వుంటుందన్నారు. ఒక వేళ ఒకరు నెగటివ్ అయి మరొకరు పాజిటివ్ అయితే వారిని సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటారని, వారు నెగటివ్ వున్న వ్యక్తితో సహజీవనం చేయవచ్చని, సంసారజీవితంలో సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వుంటుందని సూచించారు. పాజిటివ్ వున్న వారు ఎఆర్ టి మందుల్ని వెంటనే మొదలు పెట్టి క్రమం తప్పకుండా వేసుకుంటూ వుంటే వారిలో వైరస్ సాంతం కన్పించకుండా వుండే స్థాయికి చేరుతుందన్నారు. అప్పుడు వారి నుండి హెచ్ఐవి వ్యాప్తి ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని నవీన్ కుమార్ వివరించారు. దీనినే యు=యు అంటారన్నారు. నెగటివ్ వున్న వారు డాక్టర్ సలహా మేరకు ప్రెప్(ప్రి ఎక్స్ పోజర్ ప్రోఫిలాక్సిస్) మందుల్ని వాడడం ద్వారా వైరస్ బారినుండి బయటపడే అవకాశం వుంటుందని సూచించారు. ఎఆర్ టి మందులు ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా లభిస్తాయని, ప్రెప్ మందులు మాత్రం టిజి డ్రాప్ ఇన్ సెంటర్లలో తక్కువ రేటుతో అందుబాటులో వుంచామని నవీన్ కుమార్ తెలిపారు.