సంక్షిప్త వార్తలు 7 pm
సీఎం జగన్ తో ఆలీ భేటీ
ప్రముఖ సినీ నటుడు ఆలీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయలో భేటీ అయ్యారు. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా శుభలేఖ అందించారు. జగన్ ను కలిసిన వారితో ఆలీతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు.
చల్లా భగీరధ్ రెడ్డి కన్నుమూత
ఏపీ శాసనమండలి సభ్యుడు చల్లా భగీరధ రెడ్డి (46) మృతి చెందారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన రెండు రోజులుగా వెంటిలేటర్ పై ఉండి తుది శ్వాస విడిచారు. ఆయన దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు. చిన్న వయసులోనే మృతి చెందిన భగీరధ్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.
టీ-టీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఒక అపార్టు మెంటులో ఫోర్జరీ పత్రాలతో రెండు ఫ్లాట్లను కబ్జా చేశారన్న ఆరోపణలపై తెలంగాణ టిడీపీ ప్రధాన కార్యదర్శి గాుల విజయ జ్ఞానేశ్వర్ నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రోనక్ కొటేచా నుంచి తాను ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు ఫోర్జరీ అగ్రిమెంటు ఆఫ్ సేల్ సృష్టించినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి.
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఎం.డిగా రమణారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎమ్. రమణా రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లోని ఆర్ అండ్ బి భవన్ లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రమణా రెడ్డిని జనరల్ మేనేజర్ లు గుత్తా శివశంకర్ రెడ్డి, డి. వెంకటాచలం, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.