జగన్ ను వెంటాడుతున్న ఓటమి భయం
ముందస్తు ఎన్నికలపైనా సీఎం ఆలోచనలు
13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం
ధాన్యం రైతులు నకరం చూస్తున్నా….ప్రభుత్వానికి పట్టడం లేదు
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమీక్ష
అమరావతి:- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఒటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి చిత్తుగా ఓడిపోవడం వందకు వెయ్యి శాతం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని అభిప్రాయ పడ్డారు. ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇదేం ఖర్మ అంటూ భయటకు వచ్చి తమ సమస్యలపై చర్చిస్తున్నారని అన్నారు. రివర్స్ పాలనపై నేడు యావత్తు రాష్ట్రమే ఇదేం ఖర్మ అని అవేదన చెందుతోందని…అందుకే పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి ఈ స్థాయి స్పందన వస్తోందని పేర్కొన్నారు.
రోజురోజుకూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం జగన్ రెడ్డికి అర్థం అయ్యిందని…అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని అన్నారు. మేలో ఎన్నికలకు వెళ్లాలా, అక్టోబర్ లో వెళ్లాలా….లేక 2024 వరకు ఆగాలా అనే అంశంలో జగన్ ఆలోచనలో పడ్డారని చెప్పారు. తన ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకుండా నిన్న మొన్నటి వరకు జగన్ రెడ్డి భయపెట్టి కొంత మేర ఆపగలిగాడని…అయితే టిడిపి చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలతో పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రజలు ఇప్పుడు నిర్భయంగా బయటకు వచ్చి తమ సమస్యలపై గళమెత్తుతున్నారని వివరించారు. పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లతో బెదిరించినా ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యక్రమాలకు తరలివస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీయడంతో అర్హులకు పెన్షన్లు, ఇతర పథకాలు నిలిపేస్తూ కోతలు పెడుతున్నారన్నారు. నష్టపోయిన వారందరికీ టీడీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నా….ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విధానాలతో అటు రాష్ట్రం…ఇటు ప్రజలు వ్యక్తిగతంగా అప్పుల పాలయ్యారని అన్నారు. 13వ తేదీ వచ్చినా నేటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలేదని గుర్తు చేశారు. నాటి టిడిపి ప్రభుత్వం 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే…..వైసిపి ప్రభుత్వం మూడున్నరుళ్లలో పేదలకు కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టిన విషయాన్ని ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రజలతో చర్చించాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే ఎపి వెనుకబడి పోవడానికి కారణం జగన్ రెడ్డి విధానాలే అని చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డి వైఫల్యాలు, దోపిడీల కారణంగా ఏ వర్గం ఎలా నష్టపోయిందనే విషయాన్ని ఇదేం ఖర్మ కార్యక్రమంలో చర్చ చెయ్యాలని చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు.