పొగాకు రైతులను ఆదుకోవాలి

వడ్డీ మాఫీ చేయాలి..రుణాలు రీ షెడ్యూల్ చేయాలి
పొగాకు పంటను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలి
లోక్ సభలో మాగుంట శ్రీనివాసరెడ్డి
మాండౌస్ తుపాను ధాటికి పొగాకు పంటను కోల్పోయిన రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. లోక్ సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తుంటే అందులో 25 వేల ఎకరాల్లో పంట దెబ్బతినటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గడిచిన 50 ఏళ్ళలో తుపాను వల్ల ఈ స్థాయిలో పంటను కోల్పోయిన దాఖలా లేదని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. నష్టాన్ని అంచనావేసి పొగాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి అధికారుల బృందాన్ని పంపించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతులకు బ్యాంకులకు ఇప్పటికే ఇచ్చిన రుణాలపై పూర్తి వడ్డీ రాయితీ ఇవ్వాలి..రుణాలను రీ షెడ్యూల్ చేయాలి.. వడ్డీ లేకుండా తిరిగి రుణాలు ఇవ్వాలి.. ఎకరానికి రూ 20 వేల నష్టపరిహారం చెల్లించాలి..ఒక్కొక్క బ్యారన్ కు రూ 50 వేల వడ్డీ లేని రుణాన్ని పొగాకు బోర్డు సమకూర్చాలి..పొగాకు పంటను కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పరిధిలోకి తీసుకొచ్చి పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు.