ap news

తప్పుడు కేసులకు మూల్యం తప్పదు

ఆధారరహితంగా నారాయణ అక్రమ అరెస్ట్
మంత్రి బొత్స, సిఎం ను కూడా అరెస్ట్ చేస్తారా?
ఎలైన్ మెంట్ మార్పు పేరుతో కేసు హాస్యాస్పదం
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో పన్నుల బాదుడుపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుంటే దిక్కుతోచని జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ అధినేత అయిన నారాయణను అక్రమంగా అరెస్ట్ చేయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నారాయణ విద్యాసంస్థల ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించి నేడు దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల నారాయణ విషయంలో పోలీసులు వైసిపి పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా మారి వారు ఆడమన్నట్లుగా ఆడటం శోచనీయం. నారాయణను అరెస్ట్ చేయడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
జగన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గూ,లజ్జా వదిలేసి బరితెగింపు ఇటువంటి అక్రమ పద్దతులను అవలంభిస్తోంది. ఈరోజు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి విలేకరుల సమావేశం చూశాక ఆయన చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పినదానిని బట్టి పేపరు లీకేజికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎప్పుడో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసిన సిబ్బంది ఇప్పుడు యాజమాన్యానికి సహకరించారని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పోలీసులు విచారణ చేసే తీరు ఇదేనా? పేపర్ లీకేజి అంటూ 45మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో జరిగిందని అభూత కల్పనలతో నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు… ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమేయానికి గాను విద్యామంత్రిని, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలరా? విద్యామంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కడపలో సిబిఐ అధికారుల కారుడ్రైవర్ ను వివేకా హత్యకేసు నిందితులు బెదిరించారు…ఇటువంటి డీజీపీకి కనపడవా? ఆధారాలు లేకుండా నారాయణను అరెస్ట్ చేసిన ఘటనలో ఆ జిల్లా ఎస్పీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారపార్టీ వత్తిళ్లకు తలొగ్గి మీరు చేస్తున్న తప్పులకు రాబోయేరోజుల్లో మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా నారాయణను బేషరతుగా విడుదలచేసి ఆయనకు క్షమాపణ చెప్పి లెంపలేసుకోవాలి. అమరావతిలో రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, నారాయణలపై కేసునమోదు ఎపి సిఐడి కేసు నమోదు చేశారని తెలిసి నవ్వుకున్నాను. ఇప్పటివరకు అమరావతి భూములకు సంబంధించి పెట్టిన ఏ ఒక్క కేసునైనా నిరూపించగలిగారా? అమరావతిలో ఎటువంటి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయాన్ని రాష్ట్రప్రజలంతా తెలుసుకోవాలి. చంద్రబాబు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసినందుకు ఆయనపై కేసుపెడతారా? అసలు అమరావతి ఇన్నర్, ఔటర్ రింగురోడ్డులకు సంబంధించి ఎటువంటి పనులు కార్యరూపం దాల్చలేదు. లేని రోడ్డుకు రూటు మార్చారని కేసు పెట్టడం హాస్యాస్పదం. దీనిపై ఫిర్యాదుదారు ముఖ్యమంత్రి పెంపుడు మనిషి. కనీసం జనం నవ్వుతారని జంకు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *