గ్రామస్థాయిలోనే అద్బుత వైద్యం
ప్రతి గ్రామానికి విలేజ్ క్లినిక్‌లు తీసుకొచ్చాం
ఏఎన్ఎంలకు ఫుడ్ సేఫ్టీ పై శిక్షణ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం
గ్రామస్థాయి నుంచి ఆహార తనిఖీ ఉండేలా సచివాలయాలను వినియోగించుకుంటాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
భారత ఆహార భ్రదత, ప్రమాణాల సంస్థ సీఈవో అరుణ్ సింఘాల్ తో భేటి
ఆంధ్రప్రదేశ్‌లో పల్లె నుంచే పటిష్ట పాలన నడుస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. భారత ఆహార భ్రదత, ప్రమాణాల సంస్థ సీఈవో అరుణ్ సింఘాల్ తో పాటు ఎఫ్ఎస్ ఎస్ ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్్స అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు మంగళవారం మంత్రి విడదల రజినితో భేటీ అయ్యారు. ఆహార భద్రత, నాణ్యత విషయంలో దేశంలో తీసుకొస్తున్న మార్పులు, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న, తీసుకురావాల్సిన మార్పల విషయమై ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవోతోపాటు, ఆ సంస్థ ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వైద్యాన్ని ప్రతి ఇంటి ముంగిటకు తీసుకొచ్చిన గొప్ప ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పేర్కన్నారు. ప్రతి 2వేలు జనాభాకు ఒక వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను తీసుకొచ్చి గ్రామీణ వైద్యవిధానాన్ని పూర్తిగా మార్చేశామని తెలిపారు. హెల్త్ క్లినిక్‌ల తో మొదలుకుని టీచింగ్ ఆస్పత్రులు, మెడికల్ కళాశాల నిర్మాణాల వరకు మొత్తం రాష్ట్రంలోని వైద్య విధానాన్నే మార్చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలో నాడు – నేడు కింద కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ఉన్న ఆస్పత్రుల ఆధునికీకరణ, 16 మెడికల్ కళశాల నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. వీటి కోసం సీఎం వైఎస్ జగన్ ఏకంగా రూ.16,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆహార నాణ్యత, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి
సీఈవో అరుణ్ సింఘాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆహార నాణ్యత, పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి నిలిపిందని చెప్పారు. ఏపీలో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. తగిన అంచనాలతో ముందుకు వస్తే ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థాయి నుంచి ప్రభుత్వ వైద్యం అందేలా సమూల మార్పులు తీసుకొచ్చారని, ఇది ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఆహార భద్రతకు సంబంధించి హెల్త్ క్లినిక్‌ల ద్వారా కూడా పర్యవేక్షణ ఉండేలా చూస్తామన్నారు. ప్రతి ఏఎన్ ఎంకు శిక్షణ ఇచ్చి ఆహార నాణ్యతను వారు కూడా పరిశీలించేలా మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. తొలుత వైజాగ్‌లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసేలా చొరవ తీసుకుంటామన్నారు. ఆహారనాణ్యత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. వాలంటీరు వ్యవస్థను ఫుడ్ సేఫ్టి, హెల్త్ లాంటి అంశాల్లో సమర్థంగా వినియోగించుకుంటామని, ఆ మేరకు ఒక విధానాన్ని రూపొందించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ కృష్ణబాబు, ఫెడ్ సేఫ్టీ కమిషనర్ నివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.