ap news

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు..

• ఉచితంగానే స్మార్ట్ మీటర్,  పరికరాలు, సామాగ్రి
• శ్రీకాకుళం జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు..
• వివరాలను వెల్లడించిన ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
దేశంలోనే మొట్ట మొదటిసారిగా స్మార్ట్ మీటర్ తో పాటు సంబంధిత పరికరాలు, సామాగ్రి కూడా రాష్ట్రప్రభుత్వమే అందిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. రైతులకు సాధికారిత కల్పిస్తూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ ఒక్కటే పెట్టడం కాకుండా రైతుల సంరక్షణ కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు ఎవరు ఎంత సమయం వినియోగించారో తెలుసుకోవచ్చని, తద్వారా 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసం అధికారులను కూడా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. విజయవాడలో గుణదలలోని విద్యుత్ సౌధలో మంగళవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్మార్ట్ మీటర్లు అంటే ఏమిటి, స్మార్ట్ మీటర్లలో ఉపయోగించే టెక్నాలజీలు, స్మార్ట్ మీటర్ల వల్ల ప్రయోజనాలు, వేరే ఇతర మీటర్లు ఎందుకు వినియోగించడం లేదు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.

పంపు సెట్లకు ఉపయోగించే స్మార్ట్ మీటర్

ఈ సందర్బంగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారన్నారు. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులకు సంబంధించి మోబైల్ నెంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్స్ అనుసంధానం పూర్తి అయ్యిందన్నారు. బ్యాంక్ అకౌంట్స్ లేని వారికోసం స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్‌బీసీ)తో చర్చించి డిసెంబర్ 31వ తేదీలోపు వారికీ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తామన్నారు. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. వినియోగదారుల మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2019లోనే రెగ్యులేషన్ ఇచ్చిందని తెలిపారు. అందుకే 2019 లోనే అన్ని మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని 2020లో రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల 56 వేల వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లుగా పెట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మీటర్లకు కేంద్రం నుంచి ఒక్కో మీటర్ కు 900 రూపాయల గ్రాంట్ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ చొరవతో త్వరితగతిన చేయడం ద్వారా మరో 450 రూపాయలు అదనపు గ్రాంట్ కలిపి మొత్తం 1350 రూపాయలు గ్రాంట్ గా లభిస్తుందన్నారు. మీటర్లతో పాటు అలైడ్ మెటీరియల్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించడం వల్ల ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో అలైడ్ మెటీరియల్ అందిస్తున్నందుకు ఆర్.డీఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన తెలిపారు. మెకానికల్ మీటర్లు, తర్వాత ఎలక్ట్రో మెకానికల్ మీటర్లు, ఇన్‌ఫ్రా రెడ్ డేటా అసోషియేషన్ (ఐఆర్‌డీఏ) మీటర్లు కాలానుగుణంగా మార్పుచెందుతూ తర్వాత స్మార్ట్ మీటర్ల టెక్నాలజీ వచ్చిందన్నారు. స్మార్ట్ మీటర్ల వినియోగంతో ప్రయోజనాలను వివరిస్తూ.. రియల్ టైం లో డేటా అందుతుందని, గ్రిడ్ మేనేజ్ మెంట్ సులభతరం అవుతుందన్నారు. సోలార్, గ్రిడ్ నుంచి వస్తున్న రియల్ టైం లోడ్ ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్ మీటర్ల ద్వారా వీలవుతుందన్నారు. గ్రిడ్ మ్యానేజ్ మెంట్ చేసుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రైతులు ప్రమాదాలకు గురికాకుండా అరికట్టవచ్చునని ఆయన వివరించారు. కోవిడ్‌ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగాయని, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు కంపెనీలు రేట్లు కోట్ చేశాయని విజయానంద్ తెలిపారు. కోవిడ్‌ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గడంతో ప్రస్తుత ధరలతో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వాలని డిస్కంలను కోరారని, వాటికి అనుగుణంగానే టెండర్లను నిర్వహిస్తామని తెలిపారు. టెండర్లు అన్నీ అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

స్మార్ట్ మీటర్ల పని విధానాన్ని వివరిస్తున్న ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఇతర అధికారులు

రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకత నిర్ణయాల్లో భాగంగా ‘జ్యూడిషియల్ ప్రివ్యూ’ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ… వీటి ఏర్పాటుకు నిబంధనలు పెట్టిందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్లు నిర్వహిస్తున్నామన్నారు. టెండర్లు ఇప్పటికీ ఓపెన్ గా ఉన్నాయి.. నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో స్మార్ట్ మీటర్ల పైలట్‌ ప్రాజెక్ట్‌ సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్టు కింద వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల 30 శాతం విద్యుత్తు ఆదా అవుతుందన్నారు. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని తేలిందన్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయ విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. దీని ప్రకారం 20 శాతం విద్యుత్ ఆదా అయితే దాదాపు 1900 కోట్ల రూపాయలు, 30 శాతం విద్యుత్ ఆదా అయితే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని విజయానంద్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మజనార్థన రెడ్డి మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల పనితీరును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో సీఎండీ & ఏపీ జెన్ కో ఎండీ బి. శ్రీధర్, ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బి.ఏ.వి.పి. కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *