పులివెందుల కాల్పులు..వివరాలందించిన పోలీసులు
వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుందని పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పులివెందులలో మీడియాతో డి.ఎస్.పి మాట్లాడారు. కాల్పుల కేసులో నిందితుడైన భరత్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు పిస్టల్ ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసు విషయంలో ఇంకా అవాస్తవ ప్రచారాలు, వదంతులు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో 28 న మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దిలీప్(27) భరత్ యాదవ్ లు గొడవపడి అంతట భరత్ యాదవ్ తన ఇంటిలోని పిస్టల్ ను తీసుకుని వచ్చి దిలీప్ మరియు మహబూబ్ బాషా(38) లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడన్నారు. ఘటన స్థలంలో తీవ్రంగా గాయపడిన దిలీప్ వేంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని డి.ఎస్.పి తెలిపారు. గాయపడ్డ మహబూబ్ బాషా ను మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి అనంతరం చిత్తూరు కు తరలించడం జరిగిందని వివరించారు.
భరత్ యాదవ్ కు గతంలో నేర చరిత్ర లేదు…కేసులు లేవు…డి.ఎస్.పి స్థాయిలో తాను గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు… డి.ఎస్.పి శ్రీనివాసులు
తాను డి.ఎస్.పి స్థాయిలో గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదనేది పూర్తిగా అవాస్తవమని శ్రీనివాసులు తెలిపారు. భరత్ యాదవ్ 2019 సం లో తనపై హత్యాయత్నం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదయింది. తాను ఓ ప్రముఖ కేసులో సాక్షిగా ఉన్నందున తనకు ప్రాణ హాని ఉందని, సి.బి.ఐ అధికారులకు వినతి పత్రం అందచేశారు. అదే ఫిర్యాదును జిల్లా ఎస్.పి గారికి కూడా అందచేసినట్లు తెలిపారు. విట్ నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్లాజ్ 7(O) క్రింద భరత్ యాదవ్ తనకు రక్షణ కావాలని 2021, జూన్ లో మీడియా లో స్టేట్ మెంట్ ఇచ్చాడని, 2021 నవంబర్ లో దీనిపై తాను థ్రెట్ పెర్సెప్షన్ రిపోర్ట్ (టి.పి.ఆర్) నివేదిక ను ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేయడం జరిగింది. అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎం.ఎల్.సి ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ మేరకు భరత్ యాదవ్ తన పిస్టల్ ను ఫిబ్రవరి 26 న పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేసి ఎన్నికల అనంతరం మార్చి 24 న తిరిగి తీసుకున్నాడు.