దిగుబడే కాదు..పోషక విలువలు కూడా ముఖ్యం
- లోక్ సభలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు
- దిగుబడి, ఆహార భద్రతతో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది
- కేంద్రానికి ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సూచన
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తన మొదటి ముందస్తు అంచనాలలో రికార్డు స్థాయిలో 1,647.05 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ దిగుబడి వస్తుందని అంచనా వేసిందని, అయితే, మన దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నప్పుడు, ఆహార పోషక విలువలకు కూడా మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి అని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రూల్ 377 ప్రకారం లోక్ సభ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఐసిఎఆర్ అధ్యయనం ఒక ఆందోళనకరమైన ధోరణిని ప్రధానంగా ప్రస్తావించిందని, అధిక దిగుబడినిచ్చే బియ్యం, గోధుమల రకాల్లో సూక్ష్మపోషక సాంద్రత గణనీయంగా తగ్గి ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేకాకుండా జింక్ స్థాయిలు బియ్యంలో 33%, గోధుమల్లో 30% వరకు పడిపోయాయని, ఐరన్ స్థాయిలు కూడా క్షీణించాయి అని తెలిపారు. పౌష్టికాహార భద్రతను సాధించడానికి హెక్టారుకు వచ్చే అధిక దిగుబడి పైన కాకుండా పోషకాహార ఉత్పత్తిపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని, పంటల వైవిధ్యాన్ని పెంపొందించి, వైవిద్యమైన నూతన వ్యవసాయ ఆదాయ కొలమానాలను ప్రవేశపెట్టి, తదనుగుణంగా రైతులను ప్రోత్సహించాలి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ వంటి సూచికలను సాయిల్ హెల్త్ కార్డులో తప్పనిసరిగా చేర్చాలని, వైవిధ్యమైన ల్యాండ్ స్కేప్ విధానాలు, నేల జీవసంబంధ కార్యకలాపాలు, నీటి వినియోగ సామర్థ్యం వంటి ఇతర కొలమానాలను వ్యవసాయ పద్ధతుల్లో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా భారతదేశపు ఆహార ధాన్యాగారం, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ లో లోతైన వ్యవసాయ పరిశోధనలకు పెట్టుబడులు పెట్టాలని, రైతు జన బాంధవుడైన ఎన్ జి రంగా 125వ జయంతిని పురస్కరించుకొని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, సుస్థిర వ్యవసాయాన్ని అందించే ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఆయన దార్శనికతను ముందుకి తీసుకు వెళ్ళాలని కోరారు.