ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు
తేదీ.03.12.2024 మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 13 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మరియు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు శ్రీ పి.నారాయణ మీడియాకు వివరించారు. రాష్ట్ర సమాచార పౌర సంబధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు శుక్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తొలుత రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మాట్లాడుతూ…..
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన పాలసీలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది.
-వాటిలో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) పాలసీ (4.0) – 2024-2029, ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, అపెరల్ & గార్మెంట్స్ పాలసీ (4.0) – 2024-29, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ (4.0) – 2024-29 లు.
1.ఐటిఇ & సి (GAD):
-ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) పాలసీ (4.0) 2024-2029 ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీ కి గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో IT & GCC పాలసీ 4.0 (2024-2029) ని తీసుకురావడం జరిగింది.
-అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి. సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అంటారు..
-కొన్ని కీలక విధుల నిర్వహణకు బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) విదేశాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలివి..
-రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కో-వర్కింగ్ స్పేస్‌ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడళ్లను ఏర్పాటు చేయడం ఈ పాలసీ లక్ష్యం.
-నూతన ఆవిష్కరణలు, గిగ్ ఎకానమీ, వ్యవస్థాపకత మరియు స్థిరమైన ఆర్థిక అభివృద్ధికై పెద్ద ఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్కు ఫోర్స్ ను మరియు సహాయక ప్రభుత్వ విధానాలతో సహా ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానం ప్రయత్నిస్తుంది.
-స్వర్ణ ఆంధ్ర విజన్@2047 లో భాగంగా రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన “ఒకే కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-మౌలిక సదుపాయాలను సత్వరమే సృష్టించడానికి ప్రభుత్వం కో-వర్కింగ్ స్పేస్‌లు మరియు పొరుగు వర్కు స్పేస్ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇందుకు ప్రోత్సాహాకాలను కూడా పెద్ద ఎత్తున అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
-కో-వర్కింగ్ స్పేస్ అంటే ఒక సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడే ఐటి కంపెనీ, షాపింగ్ కాంప్లెక్సు, ఎంటర్టైన్మెంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది
-తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి తదితర పెద్ద కేంద్రాల్లో పొరుగు వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పొరుగు వర్కింగ్ స్పేస్ సెంటర్లకు అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లు పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత పనిచేసే వాతావరణాన్ని ఈ సెంటర్ల ద్వారా కల్పించడం జరుగుతుంది.
-కనీసం 100 సీట్ల నుండి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్లు అభివృద్ది పర్చే వారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా రూ.2 వేలను ఒక చదరపు అడుగుకు రాయితీగా ఇవ్వడం జరుగుతుంది.
-వంద మందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే రూ.2.00 లను ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుంది.
-పొరుగు వర్కింగ్ స్పేస్ సెంటర్లలో కనీసం వేయి చదరపు అడుగుల అభివృద్ది పర్చిన ఏరియాతో పాటు కనీసం పది సీట్లు ఉంటే పెట్టుబడిలో 50 శాతం రాయితీతో పాటు రూ.1,000/- లు ఒక చదరపు అడుగుకు రాయితీగా ఇవ్వడం జరుగుతుంది.
-ప్రతి సీటుకు రూ.1,000/- ల చొప్పున ఆరు మాసాల్లో ప్రోత్సాహకాన్ని కూడా అందజేయడం జరుగుతుంది
-5 లక్షల చదరపు అడుగుల ప్లోర్ ఏరియా పైబడిన ఐ.టి. క్యాంపస్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ, ఐదు సంవత్సరాల్లో రూ.2,000/- ప్రతి స్వేర్ ఫీట్ కు ఇవ్వడం జరుగుతుంది.
-ఈ రాష్ట్రాన్ని ఐ.టి. హబ్ గా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది.
-యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుపర్చాలనే లక్ష్యంతోఈ పాలసీ రూపొందించడం జరిగింది.
-ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రాడ్యుయేట్ ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేందుకు, వారు అత్యధిక జీత భత్యాలను పొందేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది..
2.ఐ & సి:
-“ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, అపెరల్ & గార్మెంట్స్ పాలసీ 4.0, 2024-29 ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం ఇది.
-రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్, గార్మెంట్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది.
-2024 – 2029 కాలంలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని 1 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-మన రాష్ట్రంలో ఈ రంగంలో మంచి నైపుణ్యం కలిగిన ఉన్న పద్మశాలీలు, చేనేత కార్మికుల ఉపాధి అవకాశలు మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఎంతగానో దోహదపడుతుంది.
-ఇందుకై అవసరమైన మౌలిక వసతులతో పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు రాయితీలను కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది.
-ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్ టైల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.
-ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్ఎంఇ లకు 30 శాతం, మద్య తరహా పార్కులకు 20 శాతం మరియు భారీ పార్కులకు 25 శాతం మేర పెట్టుబడి రాయితీ అందజేయడం జరుగుతుంది.
3.మౌలిక వసతులు & పెట్టుబడులు:
-ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 4.0 (2024-29) ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-975 కిలో మీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో ఈ మారిటైమ్ పాలసీని రూపొందించారు.
-ఈ విషయంలో గుజరాత్ ప్రథమ స్థానంలోను, ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది.
-సరుకు రవాణా విషయంలో ఏడాదికి గురజరాత్ 450 మిలియన్ టన్నులు చేస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 180 మిలియన్ టన్నులను మాత్రమే చేయడం జరుగుచున్నది.
-రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం..
-షిప్ బిల్డింగ్ పరిశ్రమను కూడా అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నది.
-రాష్ట్రంలో ఒక మెగా షిప్ యార్డును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రితో చర్చిస్తున్నారు.
-ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైం హబ్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది..
-నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు..
4.పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ:
-గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖకు (RWS&S) చెంది 24 మాసాల కాంట్రాక్టు పీరియడ్ కలిగి ఉన్న కొన్ని త్రాగునీటి సరఫరా ప్రాజెక్టుల ధరల సర్దుబాటు కోసం జారీ చేయబడిన GO.Ms.No.62 నీటి వనరుల (సంస్కరణలు-1) డిపార్టుమెంట్., Dt:30-11-2021 అమలుపై చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం , వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం మరియు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గాల్లో మూడు నీటి సరఫరా ప్రాజెక్టుల ధర సర్దుబాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-తక్కువ వర్షపాతం, కరువు కారణంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ 3 నీటి సరఫరా ప్రాజెక్టులను కొనసాగించడం ద్వారా నీటి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.. దీని ద్వారా 10.37 లక్షల మంది ప్రజలకు త్రాగునీటి సమస్య తీరనుంది.
5.గృహ నిర్మాణం :
-ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) మరియు ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) పథకాలను ప్రస్తుత యూనిట్ విలువ మరియు పద్దతితో కొనసాగించడానికి మరియు పెండింగ్‌లో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-PMAY అర్బన్ 1.0 పథకం కొనసాగింపు మరియు ప్రస్తుత యూనిట్ ధరతో ఇళ్లను పూర్తి చేయడం, 3 ఎంపికల కింద నిర్మాణంలో ఉన్న పద్దతి, మెటీరియల్ సరఫరా, కొత్త ఇసుక విధానాన్ని అనుసరించడం మరియు డ్రోన్‌లను ఉపయోగించి పెద్ద లేఅవుట్‌లలో నాణ్యత పరీక్ష నిర్వహించడం (బి) డిస్కమ్‌లు, PR&RD మరియు MA&UD విభాగాల సమన్వయంతో హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాలను చేపట్టడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-2024 డిశంబరు నాటికి ఈ పథకాల క్రింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు 2026 మార్చి వరకూ గడువు ఇవ్వడం జరిగింది.
-అర్బన్ లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు ను పూర్తి చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
6.యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం & కల్చర్:
-ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ క్రీడల పాలసీ 2024-29 సవరణలపై చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టు బడులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడల పాలసీ 2024-29 సవరణ చేయడం జరిగింది.
7.ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం:
-ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 (కేంద్ర చట్టం నెం. 14 ఆఫ్ 20)కి అనుగుణంగా బోర్డును పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ప్రస్తుతం పిలవబడుతున్న ఆంధ్రా బోర్డు ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గా పిలవబడుతుంది.
-అలాగే ఆంధ్రా బోర్డు ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలవబడుతుంది.
8.యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం & కల్చర్:
-ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-2029 యొక్క సమగ్ర వెర్షన్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలబెట్టేలా.. భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది..
-కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించనున్నారు..
-పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ టూరిజం సర్య్కూట్లను ఏర్పాటు చేయనున్నారు..
-పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుంది..
9.ఐ & సి:
-ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29) ఆమోదం కోసం ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-రాజధాని అమరావతిని ఎలక్ట్రిక్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెల్పడం జరిగింది.
-ఈ నూతన పాలసీ ద్వారా రూ. 30,000 కోట్లు పెట్టుబడులు, దాదాపు 60,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా..
-ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై వివిధ రాయతీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
10. ఆర్.టి.జి.ఎస్.:
-పునర్నిర్వచించబడిన పరిధిలో రియల్-టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు కోసం మరియు RFPS ఫ్లోటింగ్ కోసం అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-పౌరసేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్-టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయటానికి ప్రతిపాదించడం జరిగింది.
-వాట్సాప్ ద్వారా అనేక దృవీకరణ పత్రాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-డాటా ఇంటిగ్రేషన్, అనలటిక్స్ & గవర్నెన్సు హబ్ గా తీర్చిదిద్దడం
-ప్రోడక్టు డవలెప్మెంట్ హబ్, మల్టీసోర్సు విజ్యువల్ ఇంటెలిజెన్సు హబ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పెర్షప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబందిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ ఏర్పాటుకు చర్యలు.
11. డిశంబర్ 15 న ఆత్మార్పణ దినోత్సవం.:
-ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని “ఆత్మర్పణ దినోత్సవం”గా పాటించాలని మరియు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-వారి జీవిత చరిత్రను నేటి తరానికి తెలిపే విధంగా ఒక లఘు చిత్రాన్ని రూపొందిస్తాం
-ఆయన జన్మ స్థలంలోని వారి ఇంటిని ఒక మంచి మ్యూజియంగా తయారు చేస్తాము
12. జల్ జీవన్ మిషన్ పున:ప్రారంభానికి చర్యలు:
రూ.51 వేల కోట్ల ప్రాజక్టు అయిన జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిని వహించింది.
-అయితే అటు వంటి ప్రాజక్టును పున: ప్రారంభించేందుకు ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరుగుచున్నది.
-ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల రాష్ట్రంపై ఎంతో ఆర్థిక భారం పడింది.
రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు శ్రీ పి.నారాయణ మట్లాడుతూ……
-2014-19 మధ్య కాలంలో అమరావతి రాజధాని అభివృద్దికి సంబందించిన అనేక పనులు చేపట్టి కొంత మేరకు తీసుకురావడం జరిగింది.
-గత ప్రభుత్వం మూడు ముక్కల ఆట ఆడి ఈ అమరావతి రాజధాని అభివృద్ది పనులను ప్రక్కన పడేసింది.
-గత ఐదేళ్లూ ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఆ పనులు ఆగిపోయినా ఏజెంట్లను అలాగే ఉంచారు.. వారి మిషనరీ ఇక్కడే ఉండిపోయింది. అప్పట్లో ఇచ్చిన టెండర్ల రేటుకు ఇప్పడు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. సుమారు రూ.286.78 కోట్ల డ్యామేజ్ జరిగింది.
-అయితే ఈ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన ఆరు మాసాల్లోనే అనేక కమిటీలు వేసి అభివృద్ది పనుల నిర్వహణకు అడ్డుగా ఉన్న ఆటంకాలను, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడం జరిగింది.
-ఈ నేపథ్యంలో రూ.11,471 కోట్ల పనులకు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన వాటిని నేడు కేబినెట్ అప్రూవల్ లబించింది. నిర్మాణ పనులు మళ్లీ చేపడుతుండటం వల్ల భారంతోపాటు రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.
-అమరావతి రాజధానిలో ట్రంక్ రోడ్డు, లే అవుట్ రోడ్ల నిర్మాణాలు వంటి చాలా పనులను చేపట్టడం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వంలో పనులు చేయకపోగా ఉన్న రోడ్లను, ఏసీలు, డోర్‌లను తీసుకువెళ్లి పోయారన్నారు. ఇప్పడు టెండర్లు పిలవడం వల్ల జీఎస్టీ రూ.452.35 కోట్లు పెరిగిందన్నారు.
-360 కిలో మీటర్లు ట్రంక్ రోడ్లకు ఎస్టిమేషన్ రూ.460 కోట్లు పెరిగాయన్నారు. 1200 కిలో మీటర్లు లే అవుట్ రోడ్లు, 3600 అపార్ట్‌మెంట్లు కూడా ఈ నిర్మాణ పనుల్లో ఉన్నాయన్నారు.
-అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. అప్పట్లో రూ. 41 వేల కోట్లు బడ్జెట్‌గా వేస్తే ఇప్పడు 30 శాతం పెరిగిందన్నారు. ఏదేమైనా ఇప్పుడు చేపడుతున్న నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము.