ఉపాధి హామీ కోసం రాజకీయ పోరాటం
- పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర
- బడ్జెట్ లో అత్యల్ప నిధుల కేటాయింపులు
- జాబ్ కార్డ్ నుంచి 10 కోట్ల మంది పేర్ల తొలగింపు
- ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో డీబీఫ్ జాతీయ నేత కొరివి వినయకుమార్
రాజకీయ పోరాటంతోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నే కుట్రలను తిప్పికొట్టాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయకుమార్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉండగా కేవలం 34 రోజుల వేతనాలకు సరిపోయేలా రూ 86 వేల కోట్లను మాత్రమే కేటాయించటం వెనుక కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ్యం తేటతెల్లమవుతుందన్నారు. పనులు కల్పించకుండానే దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది కూలీల పేర్లను జాబ్ కార్డుల నుంచి తొలగించటం చట్ట విరుద్దమని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టబద్ధంగా ఏర్పాటయిన పథకం..ఈ పథకం కోసం 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు జీడీపీలో 2 శాతం నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు కూడా అందినా 34 రోజుల పనిదినాలకు అవసరమైన నిధులను మాత్రమే కేటాయించిందన్నారు. ఈ పథకాన్ని క్రమేపీ నీరుగార్చి నిలిపివేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతుందన్నారు. ఉపాధి హామీ వేతనాలు చట్టబద్ధంగా నిర్దారించిన కనీస వ్యవసాయ కార్మిక వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి..కనీస రోజు వారీ వేతనాన్ని రూ 800కు పెంచాలని వినయ కుమార్ డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించాలంటే నిధులు తగినంతగా ఉండాలి.. అధికారికంగా గతంలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ లను స్వీకరించిన ఏడు రోజుల్లోపే వేతనాలను బదిలీ చేయాలన్నారు. ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయటాన్ని ఉపసంహరించుకోవాలి.. తక్షణం తొలగించిన వారి పేర్లను పునరుద్ధరించటంతో పాటు 100 రోజుల పనిదినాలకు అవసరమైన నిధులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డీబీఎఫ్ జాతీయ నాయకుడు శంకర్, రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఎగొండ స్వామి, పులి కల్పన ,రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాషి సంజివ్, చుంచు రాజేందర్ ,లిబిటెక్ ఇండియా ప్రతినిధి చక్రధర్ బుద్ద తదితరులు పాల్గొన్నారు.