ap news

రాయలసీమలో ఉద్యాన హబ్

  • కరవు సీమ నుంచి కలల సాకారం వైపు

  • 201 క్లస్టర్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి

  • మదనపల్లెలో అక్టోబరు 2న హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం

  • ఎల్‌నినో ప్రభావం-ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన హబ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

    రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

ఆంధ్రావని ప్రతినిధి :  రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ప్రూట్ బౌల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబరు 2వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో కరువు, వర్షాభావంతో వెనుకబడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశంతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్‌ హార్టీకల్చర్‌ హబ్‌ గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబరు 2న శ్రీకారం చుట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.

201 క్లస్టర్లలో ఉద్యాన పంటల కార్యాచరణ

10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, ఎఫ్‌పీఓలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్‌ వ్యవస్థలను అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. క్లస్టర్‌, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాల తరహాలో రైతులు పరస్పరం సహకరించుకుంటూ ఎఫ్‌పీఓలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను సమష్టిగా మార్కెట్‌ చేసుకునే విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఉద్యాన పంటల సాగులో కొత్త రకాల పంటల ఎంపిక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేలా పంటల ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సీఎం సమీక్షించారు. ఉత్పత్తి, వినియోగం, వాణిజ్య అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శనగ, మినుము, పెసర, కంది, రాగులు, మొక్కజొన్న, జొన్నలు, ఉల్లి తదితర పంటల సాగు, కొనుగోళ్లు, కనీస మద్దతు ధరల అంశాలపై కేంద్రాన్ని సంప్రదించాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా ప్రతీ ఎకరానూ సాగులోకి తీసుకు రావటం ద్వారా ఎల్ నినో ప్రభావాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖలో ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను ఉపయోగించి ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేస్తే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందో గుర్తించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *