ap news

నిడమర్రులో ఎడ్జ్ డేటా సెంటర్

1.8 ఎకరాల భూమి కేటాయింపు

అమరావతి అధ్యయనవేత్త వల్లభనేని సురేష్ వెల్లడి

రాజధాని అమరావతిలో చిన్న తరహా డేటా సెంటర్ (ఎడ్జ్ ) ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం నిడమర్రు పరిధిలో 13వ జోన్లో సర్వే నంబర్లు 410(పి), 411 (పి) లో 1.8 ఎకరాల భూమిని కేటాయించినట్టు అమరావతి అధ్యయనవేత్త వల్లభనేని సురేష్ తెలిపారు.  అమరావతి నగరంలో డిజిటల్ సేవలు, ఇ-పాలన, ఎఐ, క్లౌడ్ అవసరాలకు తగిన విధంగా ఈ ఎడ్జ్ డేటా సెంటర్ను రూపొందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ ఎకానమీ, డేటా సెంటర్ పాలసీలో భాగంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. లీజు ప్రాతిపదికన ఏర్పాటు చేసే ఈ సెంటర్ నిర్వహణకు సిఆర్ డిఎ ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. అమరావతి రాజధాని నగరానికి పెట్టుబడులు, ఉపాధి, డిజిటల్ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ (4.0)లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

టెండర్లకు తుది గడవు అక్టోబర్ 14

పెరుగుతున్న డేటా అవసరాలను తీరుస్తుందనీ, టెలికం, విద్యుత్, నీరు సదుపాయాలన్నీ ఉన్న నేపథ్యంలో అమరావతి డేటా సెంటర్ నిర్వహణ తేలికగా ఉంటుందని టెండర్లో వివరించారు. అక్టోబర్ 14వ తేదీలోపు ఆసక్తి ఉన్న వారు టెండర్లను దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునే సంస్థలు భారతదేశంలో రిజిస్టరయిన కంపెని అయి ఉండాలని, లేదా విదేశీ జాయింట్ వెంచర్ కన్సార్టియం అయినా దాఖలు చేయొచ్చని వివరించారు. దేశంలో ఐదు మెగావాట్ల ఐటి పవర్లోడ్తో కంపెనీ ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. భారతదేశంలో కనీసం 10 మెగావాట్ల క్యుములేటివ్ ఆపరేషనల్ ఐటి పవర్ లోడ్ ఉండాలని టెండర్లలో పేర్కొన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం యాక్టివ్ సబ్ స్క్రీయ్ బర్ బేస్ను కలిగి ఉండాలని తెలిపారు. స్థలం పొందిన ఏడాదిలోపు కనీసం 50 శాతం ఐటి పవర్లోడ్ కలిగి ఉండాలని, రెండేళ్లలో పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని తెలిపారు. డేటా సెంటర్ డెవలపర్లు / ఆపరేటర్లు/టెలికం ఆపరేటర్లకు లీజు పద్ధతిలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో భూమిని కేటాయించనున్నారు. 33 ఏళ్ల లీజు ఉంటుందని, పరస్పర అంగీకార నిబంధనలకు లోబడి 33 సంవత్సరాలు పొడిగించుకోవడానికి వీలవుతుందని తెలిపారు. స్థలం పొందిన 30
రోజుల్లోపు రెండుకోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ, ష్యూరిటీ బాండ్ సమర్పించాలని సూచించారు. దీనికి కేటాయించే స్థలం ఎకరం నాలుగు కోట్లుగా అంచనా వేసినట్లు టెండర్లో పేర్కొన్నారు.

స్మార్ట్ నగరంగా మారడంలో కీలకం

నిడమర్రులో ఎడ్జ్ డేటా సెంటర్  ఏర్పాటు చేయడం వల్ల అమరావతిలో సిసిటివి కెమెరాలు, రాకపోకలు, ఆన్లైన్ బిల్లింగ్, మానవ కదలికలు, స్మార్ట్ పోలీసింగ్, పన్నులు, సర్వీసు ఛార్జీలు, విద్యుత్ లైట్ల నిర్వహణ ఇతర అన్ని కార్యకలాపాలు తేలికగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. మొత్తంగా అమరావతి స్మార్ట్ నగరంగా మారడంలో డేటా సెంటర్ కీలకమని వివరించారు.

ఎడ్జ్ డేటా సెంటర్ అంటే ..

పెద్దపెద్ద నగరాల్లో ఏర్పాటు చేసే చిన్న తరహా డేటా సెంటర్లను ఎడ్జ్ డేటా సెంటర్లుగా పిలుస్తారు. ఇవి యూజర్ల డేటా వచ్చే ప్రాంతాలకు దగ్గరలో ఉంటాయి. వీటివల్ల డేటా వేగంగా బదిలీ అవుతుంది. ఆన్లైన్ గేమ్లు, లైవ్ వీడియో స్ట్రీమింగ్, ఆటోమొబైల్స్, స్మార్ట్ సిటీ అప్లికేషన్లు వేగంగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రతి సమాచారాన్ని అక్కడికక్కడే ప్రాసెస్ చేస్తాయని సురేష్ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *