ap news

ఉల్లిపాయలు కేజీ రూ 35

– ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
– తొలి దశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో నేటి నుండి అమలు
– ఆధార్/రేషన్ కార్డు ఆధారంగా కుటుంబానికి నెలకు 2 కేజీలు
– ప్రజల డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
– మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వెల్లడి

అమరావతి, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.35కే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల చొప్పున, కేజీ రూ.35 ధరకు ఉల్లిపాయలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రయోగాత్మకంగా విజయవాడలో విక్రయం

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రులు తెలిపారు. ఉల్లిపాయల ధరల విషయంలో కూడా ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో సబ్సిడీ ధరకు విక్రయాలు చేపడుతున్నట్లు వివరించారు. విజయవాడలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందన, డిమాండ్‌ను బట్టి తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లకు విస్తరించి, సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *