హైదరాబాద్ లో డీఎస్ఎస్ లీగల్ క్లినిక్
- దళిత, ఆదివాసీ మహిళలు, బాలికల న్యాయం కోసం లీగల్ క్లినిక్
- 35 తీవ్ర అఘాయిత్యాల కేసుల్లో బాధితులు, సాక్షుల ఆవేదన
హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో దళిత, ఆదివాసీ మహిళలు, బాలికలపై జరిగిన అఘాయిత్యాల కేసుల్లో బాధితులకు న్యాయం అందించేందుకు డీఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని లక్డీకాపూల్ అశోకా హోటల్లో లీగల్ క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35 తీవ్ర అఘాయిత్యాల కేసులకు సంబంధించి బాధితులు, సాక్షులు పాల్గొని న్యాయం పొందే క్రమంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు జ్యూరీ సభ్యులుగా ఈ క్లినిక్కు హాజరయ్యారు. వారిలో ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, విజయేంద్ర బోయి, పీసీఆర్ సెల్ ఎస్పీ బాల కోటి, డీఓపీకి చెందిన శంబశివ రెడ్డి, డీసీపీ శివకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజా రమణి, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యదర్శి సుభద్ర, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన సునీత తదితరులు ఉన్నారు.
ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంవీఎఫ్ నుంచి వెంకటరెడ్డి, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఆర్గనైజేషన్స్ నుంచి మహేశ్వర్ రాజ్, షహీన్ ప్రతినిధి జమీలా, స్వార్డ్ (SWARD) నుంచి శివకుమారి, జర్నలిస్టులు కృష్ణకుమారి, సజయ తదితరులు హాజరయ్యారు. డీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం క్లినిక్కు అధ్యక్షత వహించి, కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్ఎస్ సమన్వయకర్తలు, మహిళా సంఘాల నాయకులు కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.

35 కేసులకు చెందిన బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని, న్యాయం పొందేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వివరించారు. న్యాయవ్యవస్థను ఆశ్రయించే క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
బాధితులకు న్యాయం అందించేందుకు లీగల్ క్లినిక్ నిర్వహించిన డీఎస్ఎస్ను జ్యూరీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అభినందించారు. బాధితులు న్యాయం పొందే ప్రక్రియలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అఘాయిత్యాల బాధితులకు న్యాయ సహాయం అందుబాటులోకి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరించారు.

