రాష్ట్రంలో పచ్చ ముఠాల అరాచకాలు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దాడులు
నామినేషన్లనూ వేయనివ్వడం లేదు
దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీదే
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో రాష్ట్రంలో మూడు రోజులుగా సాగుతున్న అధికార పార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)ను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు.ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠతో భేటీ తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు.
నామినేషన్లు వేయలేకపోతే ఎస్‌ఈసీ పరువు పోతుంది
నామినేషన్ల దాఖలు గడువు వెంటనే పెంచాలి
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌ ఇవ్వాలి
ఎస్‌ఈసీకి  వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి
రాష్ట్రంలో గతి తప్పిన పోలీస్‌ వ్యవస్థ
తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలు దించాలి
పోలింగ్‌ కేంద్రాలు, బ్యాలెట్‌ బాక్సుల తరలింపు. స్టోర్‌
అన్ని చోట్లా సీసీ టీవీ లైవ్‌ టెలికాస్ట్‌ ఇవ్వాలి
అమరావతి, ఆంధ్రావని :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకుంటున్న దౌర్జన్యాలు, టీడీపీ శ్రేణుల హింసాకాండ, వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు, అరెస్టులు, నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్న ఘటనలు, అలాగే పుంగనూరులో వైయస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం, పులివెందులలో పోలీసుల బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పుల ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌ చంద్ర పునేఠకు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో ఆయన్ను కలిసిన శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత ఆ ఆఫీస్‌ వద్దే మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ఫణంగా పెట్టొద్దు
ఇవాళ ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠ కలిసి గట్టిగా రిక్వెస్ట్‌ చేయడం జరిగింది. ఒక స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మీపై ఉంది. ఈ వ్యవస్థను ఏ ఒక్కరి స్వార్థం కోసం కూడా ఫణంగా పెట్టకూడదన్న అంశాన్ని కమిషనర్‌కు స్పష్టంగా నొక్కి చెప్పడం జరిగింది. మాకు అందిన సమాచారం మేరకు దాడులకు సంబంధించిన తాజా పరిస్థితులతో కూడిన జాబితాను కూడా ఆయనకు అందజేశాం.
ఒక్కరు నామినేషన్‌ వేయలేకపోయినా ఎస్‌ఈసీ పరువే పోతుంది
ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా, ఏ ఒక్క ప్రాంతంలోనైనా ‘నేను నామినేషన్‌ వేయాలనుకున్నాను.. కానీ నన్ను వేయనివ్వలేదు’ అన్న మాట వస్తే, పోయేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పరువే అని గట్టిగా చెప్పాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీలే స్వయంగా ముందుండి ఎస్కార్ట్‌ ఇచ్చి వైయస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించాల్సిన రాజ్యాంగ ధర్మం ఉంది. దీనిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ.. సమయం పొడిగించి అయినా సరే రాష్ట్రంలో పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరితో నామినేషన్‌ వేయిస్తామని హామీ ఇచ్చారు.
గురజాలలో అభ్యర్థులనే అక్రమంగా అరెస్ట్‌ చేసిన పోలీసులు
గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో స్వయంగా పోలీసులే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులపై దొంగ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్‌ చేసి పోటీకి దూరం చేస్తున్నారు. అక్రమంగా నిర్బంధించిన ఆ అభ్యర్థులను పోలీసులు వెంటనే తీసుకొచ్చి వారితో నామినేషన్లు వేయించాలని గట్టిగా డిమాండ్‌ చేశాం.
టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు.
వెంటనే కేంద్ర పారా మిలటరీ బలగాలను దించాలి:
రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఇంత దారుణంగా సాగుతుంటే, పోలీసులు మాత్రం నిస్సిగ్గుగా వెన్నుపోటు పార్టీకి, చంద్రబాబునాయుడుగారికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే వెళ్లాలని మా వైయస్సార్‌సీపీ వాళ్లను ఆపుతున్నారు.. తీరా నామినేషన్‌ కేంద్రాల వద్ద చూస్తే అప్పటికే టీడీపీ వాళ్లు వందల సంఖ్యలో గుమిగూడి మారణాయుధాలతో తిష్టవేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే మా అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నందున ఎన్నికల విధులకు వెంటనే కేంద్ర ప్రభుత్వ బలగాలను, పారా మిలటరీ ఫోర్సెస్‌ను దించాలని డిమాండ్‌ చేశాం.
అన్ని చోట్లా సీసీ కెమెరా ఫుటేజ్‌ కావాలి
పోలింగ్‌ బూతుల లోపల, బయట సీసీటీవీ లైవ్‌ ఫుటేజ్‌ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలి. మాకు చంద్రబాబునాయుడు, వెన్నుపోటు పార్టీ నైజంపై ఏ మాత్రం నమ్మకం లేదు. వాళ్లు స్ట్రాంగ్‌ రూమ్‌లలో బ్యాలెట్‌ బాక్సులను మారుస్తారన్న గట్టి నమ్మకం, అనుమానం మాకుంది. అందుకే స్ట్రాంగ్‌ రూమ్‌లలో బ్యాలెట్‌ బాక్సులు ఉంచే ప్రదేశాల్లో కూడా సీసీటీవీ కెమెరాల లైవ్‌ ఫుటేజ్‌ను ప్రజలందరికీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలి. కౌంటింగ్‌ హాల్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టి లైవ్‌ టెలికాస్ట్‌ ఇవ్వాలి.
కౌంటింగ్‌ హాల్‌లో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఏజెంట్లు సంతకాలు చేసి స్టిక్కర్లు అతికించే ’ఫామ్‌ 17సి’ వెరిఫికేషన్‌ ప్రక్రియ అత్యంత కీలకం. ఆ సంతకాలు సరిపోల్చే ప్రక్రియలో ఎలాంటి ఫోర్జరీలకు తావు లేకుండా సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్‌ చేసి చూపించాలి. ఈ డిమాండ్లపై గతంలోనే మా ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఇవాళ నేను కూడా స్వయంగా వచ్చి వీటిని అమలు చేయాలని గట్టిగా చెప్పాను.
ఎస్‌ఈసీ చిత్తశుద్ధికి ఇదే పరీక్ష
మేము అడిగిన వాటన్నింటికీ కమిషనర్‌ గారు తల ఊపారు. ఎస్‌ఈసీ నిజంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే ఇవన్నీ అమలవుతాయి. కమిషన్‌ పారదర్శకంగా లేకపోతే ఇవేవీ జరగవు. దీన్నిబట్టే వీళ్లు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ, నాయకులకు పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసే హక్కు రాజ్యాంగబద్ధమైనవి. ఈ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ధర్మం ఎస్‌ఈసీపైనే ఉంది.
చంద్రబాబు ప్రైవేట్‌ వాచ్‌మెన్లుగా మారిన పోలీసులు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం చంద్రబాబునాయుడుగారికి ప్రైవేట్‌ వాచ్‌మెన్లుగా తయారైంది. ఒక ఐజీ, ఆయన కింద డీఎస్పీలు, సీఐలు ఒక సిండికేట్‌ మాఫియాగా ఏర్పడ్డారు. సాధారణంగా ఏ అధికారైనా ఒకే చోట రెండేళ్లకు మించి ఉండకూడదన్న నిబంధన ఉన్నా, రెండున్నరేళ్లుగా వాళ్లనే పాత స్థానాల్లో కొనసాగిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికలను నడిపించేందుకే ఈ వ్యవస్థీకత మాఫియాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ పోలీసు మాఫియా స్థానిక ఎమ్మెల్యేలతో కుమ్మక్కై ఇసుక రీచ్‌ల నుంచి లిక్కర్‌ వ్యాపారం దాకా అందినకాడికి దోచుకుంటూ ‘చిన్నబాబుకు ఇంత.. పెద్దబాబుకు ఇంత’ అని వాటాలు పంచుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. ఇలాంటి వారి చేతుల్లోనే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
పచ్చి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్‌
డీఐజీ కోయ ప్రవీణ్‌ అచ్చం టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరును చూస్తేనే ఐపీఎస్‌ అనే వృత్తి ధర్మాన్ని, యూనిఫాం టోపీపై ఉన్న మూడు సింహాల గౌరవాన్ని సైతం గాలికొదిలేసి టీడీపీ తొత్తులా ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.
నిమ్మగడ్డ రమేష్‌ కమిషనర్‌గా ఉన్నా నాడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపాం:
గత మా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఎవరున్నారు? చంద్రబాబుకు కరడు గట్టిన మద్దతుదారుడైన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించండి అంటూ స్వయంగా బలపం కట్టుకుని తిరిగిన వ్యక్తి ఆయన. అంతటి వ్యతిరేక వ్యక్తి కమిషనర్‌గా ఉన్నప్పటికీ మా హయాంలో ధైర్యంగా ఎన్నికలకు వెళ్లాం. నోటిఫికేషన్‌ రాగానే నిమ్మగడ్డ రమేష్‌ కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, డీఎస్పీలు, సీఐలను లెఫ్ట్, రైట్, సెంటర్‌ బదిలీలు చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఈరోజు అలాంటి చర్య ఒక్కటైనా జరుగుతోందా? మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, మహిళా సాధికారత, పారదర్శక పాలన అందించాం కాబట్టే ప్రజలు మాకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు.
హామీలు మోసాలని తేలడంతో ఎన్నికలు జరిపే ధైర్యం చాలని చంద్రబాబు:
నేడు చంద్రబాబు ప్రభుత్వంలో సూపర్‌ సిక్స్‌లు లేవు, సూపర్‌ సెవెన్‌లు లేవు.. అన్నీ మోసాలుగా తేలిపోయాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లను చేతబట్టుకుని ప్రజలు ‘మాకు మూడేళ్లుగా బాకీ పడ్డ సొమ్ము ఎప్పుడు ఇస్తారు?’ అని టీడీపీ నేతలను నిలదీస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్, సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కుదేలైపోయాయి. అందుకే చంద్రబాబుకు ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలు జరిపే ధైర్యం లేక ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు.
మిథున్‌రెడ్డి వాహనంలో బోల్తా పడని మద్యం బాటిళ్లు..
పోలీసులే లేని ఆధారాలు సృష్టించారు:
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కి సీఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ ఉంది. అక్కడ ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి సాక్ష్యాలతో సహా వాళ్లే ప్రత్యక్ష సాక్షులుగా రిపోర్టులు ఇస్తారు. మిథున్‌రెడ్డి కేవలం నలుగురితో కలిసి నామినేషన్‌ కేంద్రానికి వెళ్తే, అప్పటికే వేలాదిగా మోహరించిన టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. మిథున్‌రెడ్డిని మూడు గంటల పాటు నిర్బంధించి, నామినేషన్‌ పత్రాలను తీసుకోకుండా అడ్డుకుని, కార్లను ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. బోల్తా పడిన కార్లలో మద్యం బాటిళ్లు మాత్రం నిటారుగా నిలబడి ఉన్నాయి! కారు బోల్తా పడితే మద్యం బాటిళ్లు పడకుండా నిటారుగా ఎలా ఉంటాయి? మద్యం అలవాటు లేని మిథున్‌రెడ్డి కారులో పోలీసులే దగ్గరుండి బాటిళ్లు పెట్టి, తప్పుడు ఆధారాలు సృష్టించారు. డీఐజీ పరిధిలోనే ఈ దారుణాలన్నీ జరిగాయి.
అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించే వరకు సమయం పొడిగించాల్సిందే:
ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం 3:30 దాటినా, రాత్రి 8 గంటల వరకైనా సరే సమయం పొడిగించి అర్హులైన వైయస్సార్‌సీపీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయించాలని కోరగా కమిషనర్‌ అంగీకరించారని వైయస్‌.జగన్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును, పోటీ చేసే స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత కమిషన్‌పైనే ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *