మహాభారత పునః కథనం ‘పర్వ’
నాకు మహాభారతం లోని పాత్రల మనస్తత్వ చిత్రణ చాలా ఆసక్తి కలిగిస్తుంది. బొమ్మల భారతం నుంచి కవిత్రయ భారతం, ఉషశ్రీ తదితురులు రాసిన అనేక భారతాలు , ఈ మధ్య దుర్యోధనుని భారతంగా ఆనంద్ నీలకంఠన్ రాసిన రెండు భాగాలు (అజేయుడు /Ajaya:Roll of the dice; కలియుగారంభం /Rise of Kali) , ఇంకా మహాభారత పాత్రల మనస్తత్వ చిత్రణ లాంటి పరిశోధనా గ్రంధాలు, పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యం రాసిన మహాభారత చరిత్రం …. అలానే కల్లూరి భాస్కరం రాసిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ … ఇలా చాలానే భారతం గురించి చదివాను. అయితే ఈ రోజే ముగించిన ఎస్.ఎల్.బైరప్ప రాసిన ‘పర్వ’ గురించి రెండు వాక్యాలు రాయాలనిపించింది.
ఎస్..ఎల్.భైరప్ప కన్నడ రచయత లలో బాగా ఆదరణ ఉన్న రచయత. అతని రచనలన్నీ భారతీయ భాషల్లోకి అనువదితమయ్యాయి. అతని ‘ఆవరణ ‘నవల మొదటి ఐదు నెలల్లోనే 10 ముద్రణ లకు నోచుకుంది. దాదాపుగా 25 నవలలు, ఆత్మకథ, కథలు, విమర్శనా గ్రంధాలు రచించిన వారిని అనేక జాతీయ,రాష్ట్ర స్థాయి పురస్కారాలు వరించాయి. భైరప్ప రచించిన దాటు(1973) నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(1975) లభించింది. వీరి వంశ వృక్ష (1966) నవలకు కన్నడ రాష్ట్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. ఈ నవల ఆధారంగా తీసిన ‘వంశ వృక్షం’ (1972)సినిమా ప్రభుత్వ పురస్కారం పొందింది. తెలుగులో బాపు దర్శకత్వంలో ఇదే సినిమాను ‘వంశ వృక్షం’(1980) పేరుతొ తీసారు. వీరికి సరస్వతీ సమ్మాన్ పురస్కారం , పద్మ శ్రీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ , ఎన్.టి.ఆర్ జాతీయ సాహిత్య పురస్కారం లభించాయి. అతని ‘ఆవరణ’ నవల కొంత మేరకు విమర్శకు గురయినప్పటికీ పాఠకుల ప్రశంసలు పొందింది.
‘పర్వ’ నవల మహాభారతాన్ని ప్రధాన పాత్ర ల ఆలోచనలు, జ్ఞాపకాలు, వాళ్ళ కార్యాచరణ ని వివరిస్తూ సాగిన పునః కథనం . ఏడువందల పేజిలకి పైగా ఉన్న ఈ బృహత్ గ్రంధం ఏమాత్రం విసుగు అనిపించకుండా అప్పటి కాలం, ప్రాంతాలు, తాత్వికాంశా లు , వివిధ మానవ సమూహాలు, ఆచారాలు, అప్పటి సామాజిక నిర్మాణం,విలువలు, మరణం, యుద్ధ విధానాలు అన్నింటినీ వివరించే ఒక ప్రయత్నం. ఈ రచన అప్పటి చారిత్రిక కాలానుగుణమైన వాస్తవికతను మనకు చూపుతుంది. ముఖ్యంగా పురాతత్వ శాస్త్ర ఆధారిత అంశాలను గమనించవచ్చు.
ఎస్.ఎల్.భైరప్ప హిమాలయ ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఒక గ్రామంలో నివాసం ఉండాల్సివచ్చినప్పుడు గమనించిన విషయం ఈ నవల రచనకు నాంది అని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. వారు అప్పుడు ఉన్న ఆ గ్రామంలో బహు భర్తృత్వం ఉండడం గమనించారు. తదుపరి దాదాపుగా మహాభారతం కథా ప్రాంతాలను ఒక సంవత్సరం పాటు పర్యటించారు.
ఇక ఈ నవల ప్రారంభం మద్రదేశం నుంచి ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధ సన్నాహాలలో భాగంగా పాండవులు కౌరవులు తమ తమ పక్షాలలో చేరి యుద్ధం చేయవలసిందిగా దూతలను పంపడం జరిగే సందర్భం. ఇక అక్కడినించి ప్రధాన పాత్రలు కుంతి , ద్రౌపది, భీష్ముడు, అర్జునుడు, భీముడు, విదురుడు, దుర్యోధనుడు, సాత్యకి, శల్యుడు, కర్ణుడు, గాంధారి, దృతరాష్ట్రుడు ఇలా ఆలోచనా స్రవంతి సాగుతుండగా మహాభారతం కథ మనకు కొత్తగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గాధలో పౌరాణిక కల్పనాం శాలను డి –మిత్ చేయడం ద్వారా ఈ పాత్రలన్నీ రక్తమాంసాలతో కనపడతాయి.
ఈ నవల ఒక గొప్ప రచనగా విమర్శకుల, పాఠకుల ప్రశంసలు పొందింది. దాదాపుగా అన్ని ప్రధాన భాషలతో పాటుగా చైనా, రష్యా భాషల్లోకి కూడా అనువదితమైంది . తెలుగులో ‘పర్వ’ గా శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అనువదించారు. వారి అనువాదం ఎంత సరళంగా సాగిందంటే ఈ నవలను చాల తక్కువ సమయంలో చదవడం సాధ్యమయ్యేంతగా . అందుకే ఈ నవలను అనువదించినందుకు వారికి 2004 లో కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాదకుని పురస్కారం లభించింది.