ఒంగోలులో కారంచేడు మృతవీరుల సభ
కులవివక్షపై పోరాటమే అసలైన నివాళి
ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్
కుల వివక్షత, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడడమే కారంచేడు మృత వీరులకు నిజమైన నివాళి అని ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ రావు అన్నారు. ఒంగోలులోని మంచిపుస్తకం ప్రాంగణంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 17న సోమవారం కారంచేడు మృతవీరుల 38వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ 1985 జూలై 17న కారంచేడులో దళితులు, మాదిగల మంచినీటి చెరువులో అగ్రకుల కమ్మ భూస్వాములు తమ పశువులను కడిగి తాగే నీటిని కలుషితం చేయడాన్ని వ్యతిరేకించినందుకు 8 మంది మాదిగలను అతి కిరాతకంగా హత్య చేశారని గుర్తించారు. ఈ దమనకాండ దేశవ్యాప్తంగా ప్రజా సాంఘిక శక్తుల్లో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ద్వారా కల్పించిన రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకుంటూ కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా అందరికీ సమాన అవకాశాల కోసం పోరాడటమే కారంచేడు మృత వీరులకు నిజమైన నివాళి అని అన్నినారు. కవి, రచయిత కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కారంచేడు ఉద్యమ ఫలితంగా అనేకమంది రచయితలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి ఉద్యమాలు చేశారనీ, మృతవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డి హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు, అఖిల భారత విప్లవ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ భీమవరపు సుబ్బారావు, కే ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు ఎం జార్జి, ఐ ఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పేరం సత్యం, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ చిక్కాల కిరణ్ కుమార్, విశ్వమాన సంక్షేమ సంఘం నాయకులు కొటారి జనార్ధన్, పిన్నికి శ్రీను రచయిత, రచయిత రెబ్బవరపు ఉదయ్, సీనియర్ కమ్యూనిస్టు లింగా వెంకటేశ్వర్లు, ప్రజా కళామండలి జిల్లా సహాయ కార్యదర్శి గోపి, దళిత నాయకులు రమేష్, డప్పు యోహాన్, పి వై ఎల్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, దళిత మహాసభ మాజీ నాయకులు సిహెచ్ సంపత్ కుమార్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.