Prakasam

సమైక్య పోరాటాలతోనే విముక్తి

సహజ సంపదలను కాపాడుకునేందుకు కలిసి రావాలి 

రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు  సింహాద్రి ఝాన్సీ

రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) ప్రకాశం జిల్లా మహాసభలు 

రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) ప్రకాశం జిల్లా మహాసభలు ఒంగోలు వేమూరి కళ్యాణ మండపంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయని రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ శిరిగిరి లలిత కుమారి తెలియజేశారు. AIFTU (New) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ డివిఎన్ స్వామి అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు.

రైతు కూలీ సంఘం (ఆంధ్ర ప్రదేశ్) జిల్లా కార్యదర్శి లలిత కుమారి అధ్యక్షత వహించిన ప్రారంభ సభలో ప్రారంభోపన్యాసం చేసిన రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ… వర్షాలు లేక సాగునీటి వనరులు లేక రైతులు ఆవేదనలో ఉన్నారని, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు కొనసాగుతున్నాయనీ, నిత్యావసరాలు, విద్య, వైద్యం అందుబాటులో లేవనీ ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా మతం, కులం పేరుతో పాలకులు జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. భూమిని రైతుకు దూరం చేసి కార్పోరేటర్లకు కట్టబెడుతూ, అడవులు, కొండలు, నదుల నుండి గిరిజనులని గెంటివేసి బహుళజాతి కంపెనీల పరం చేస్తున్న పాలకుల దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమానికి సిద్ధం కావాలని మహాసభకు పిలుపునిచ్చారు.

సభకు హాజరయిన కార్యకర్తలు

అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ శ్రీ చుండూరి రంగారావు మాట్లాడుతూ సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి మద్దతు ధరను నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పాలకులు పక్కన పెట్టారని, రాజ్యాంగాన్నే పక్కన పెట్టి సొంత అజెండాతో పనిచేస్తున్న పాలకులను పక్కనపెడితేనే వ్యవసాయం బ్రతుకుతుందని స్పష్టం చేశారు. తర్వాత ఆచార్య రంగా కిసాన్ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ చుంచు శేషయ్య మాట్లాడుతూ బడ్జెట్లో పంటల బీమాకి వేల కోట్ల రూపాయలు కేటాయించినా ఖర్చు చేయకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల లక్షలు నష్టపోయిన రైతులకు వందల్లో పరిహారం ఇస్తున్నారని తెలియజేశారు.

మహాసభల సందర్భంగా ఒంగోలు నగరంలో భారీ ప్రదర్శన.. కళాకారుల డప్పు నృత్యాలు

అనంతరం AIFTU (New) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ డి.వి.ఎన్.స్వామి మాట్లాడుతూ ప్రభుత్వానికి 60% ఆదాయాన్ని అందిస్తున్న శ్రామికులలో 90% మంది ఎలాంటి భద్రతా లేని ఉపాధులలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు లక్షల కోట్లు దోచి పెడుతూ, పేదలకు రేషన్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదంటున్నారని విమర్శించారు. కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలతోనే మనందరి సమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. ఇంకా ఈ మహాసభలలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎం.ఎస్.నాగరాజు, ఓ.పి.డి.ఆర్. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కత్తి పేరయ్య తదితరులు ప్రసంగించారు.

నూతన కమిటీ ఎన్నిక

రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) ప్రకాశం జిల్లా మహాసభలలో భాగంగా ప్రారంభ సభ అనంతరం జరిగిన ప్రతినిధుల సభలో గత మహాసభల నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘం కార్యకలాపాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. ఆ తర్వాత కామ్రేడ్ వేజండ్ల రామారావు అధ్యక్షులుగా, కామ్రేడ్ సిరిగిరి లలిత కుమారి కార్యదర్శిగా, కామ్రేడ్ పరిటాల కోటేశ్వర రావు సహాయ కార్యదర్శిగా, కామ్రేడ్ వాటంబేటి శ్రీరాములు కోశాధికారిగా మరో పన్నెండు మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *