ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు

తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి ఉత్సవాల్లో

ఉపన్యసించిన ఆచార్య కె.సర్వోత్తమరావు

ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు బుధ‌వారం ప్రారంభమయ్యాయి.

సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.సర్వోత్తమరావు ”అన్నమయ్య – గ‌రుడాళ్వార్లు, హ‌నుమ‌త్సంకీర్త‌న‌లు ” అనే అంశంపై ఉపన్యస్తూ శ్రీ వైష్ణ‌వ ఆల‌యాల్లో స్వామికి ద‌గ్గ‌ర‌గా గ‌రుడాళ్వార్‌, ఆల‌యానికి బ‌య‌ట శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారు ఉంటార‌న్నారు. 108 దివ్య దేశాల‌లో గ‌రుడ వాహ‌నానికి విశేష ప్రాధాన్య‌త ఉన్న‌ట్లు అన్న‌మ‌య్య త‌న సంకీర్త‌న‌ల ద్వారా తెలిపార‌ని చెప్పారు. రాయలసీమ, కర్ణాటకలోని పలు రామాలయాలను అన్నమయ్య సందర్శించి కీర్తనలు రచించారని తెలిపారు. వీటిలో రాయలసీమలోని ఒంటిమిట్ట, గండికోట, కర్ణాటకలోని హంపి ప్రాంతంలోని విజయనగర రాజులకాలంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయ‌న్నారు. సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకంతోపాటు రామాయణంలోని పలు సన్నివేశాలు ఈ కీర్తనల్లో గోచరిస్తాయని వివ‌రించారు.

తిరుప‌తి రాష్ట్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు డా.చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ ”ఆళ్వార్లు, ఆచార్యులు, గురువుల‌పై అన్నమయ్య సంకీర్త‌న‌లు” అనే అంశంపై మాట్లాడుతూ అన్న‌మ‌య్య ఆళ్వార్ల‌ దివ్య ప్ర‌బందాల‌ను, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, వారు ఉప‌దేశించిన న‌వవిధ‌ భ‌క్తి మార్గాల‌తో శ్రీ‌వారిని సేవించి, వేలాది సంకీర్త‌న‌లు ర‌చించార‌న్నారు. ఆళ్వార్లు, ఆచార్యులు, గురువుల అభిమ‌తాన్ని అన్న‌మ‌య్య త‌న కీర్త‌న‌ల్లో అవిష్క‌రించిన‌ట్లు చెప్పారు. అన్న‌మ‌య్య శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని కీర్తిస్తూ, అహోబిల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిపార‌న్నారు. అన్న‌మాచార్యుల‌వారు ఆళ్వారుల 4 వేల దివ్య ప్ర‌బందాల‌ను ఆధారంగా చేసుకుని స‌క‌ల కీర్త‌న‌లు ర‌చించిన‌ట్లు వివ‌రించారు.

ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం విశ్రాంతాచార్యులు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి ”అన్నమయ్య వంశీయులు చేప‌ట్టిన తిరుమ‌ల కైంక‌ర్యాలు” అనే అంశంపై మాట్లాడుతూ అన్న‌మ‌య్య‌, పెద్ద తిరుమలాచార్యుడు వంటి తాళ్ల‌పాక వంశీయులు శ్రీ‌వారి సేవ‌తో పాటు సాహితి సేవ‌లందించార‌న్నారు. సాహిత్యం ద్వారా ప్ర‌తిభ విశేషాలు తెలుస్తుంటే, శాస‌నాల ద్వారా వ్య‌క్తిగ‌త విశేషాలు, సామాజిక అంశాలు తెలుస్తున్నాయ‌న్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో 51 శాస‌నాలు ల‌భించాయ‌ని, ఇందులో 33 శాస‌నాలు పెద్ద తిరుమ‌లాచార్యుల‌కు సంబంధించిన‌వి ఉన్న‌ట్లు చెప్పారు. తిరప‌తి, తిరుమ‌ల ఆల‌యాల‌తో పాటు హంపి, శ్రీ‌రంగం త‌దిత‌ర ఆల‌యాల్లో వీరు చేసిన కైంక‌ర్యాల‌ను వివ‌రించారు.

అనంతరం ఉపన్యాసకులను టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్ర‌త్యేకాధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్ట‌ర్‌ ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌ శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ మ‌ధుసూద‌న్ రావు బృందం గాత్ర సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ చంద్ర‌శేఖ‌ర్ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

మహతి కళాక్షేత్రంలో బుధ‌వారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ మ‌ణిర‌త్నం బృందం మంగ‌ళ‌ధ్వ‌ని, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు విశ్రాంత క‌ళాకారులు శ్రీ రంగ‌నాథ్‌ బృందం గాత్రం, రాత్రి 7.15 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ ర‌వి సుబ్ర‌మ‌ణ్యం భ‌ర‌త‌నాట్యం జ‌రుగ‌నుంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *