
NCD 4.0 సర్వేలో 12.23 లక్షల కొత్త బీపీ కేసులు, 11.58 లక్షల కొత్త మధుమేహ కేసుల గుర్తింపు
14 నెలల్లో 2.86 కోట్ల మందికి పరీక్షలు.. 12,768 క్యాన్సర్ కేసులు వెలుగులోకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం కేసులు గణనీయంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన NCD 4.0 సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఉన్న కేసులతో కలిపి రాష్ట్రంలో బీపీ బాధితుల సంఖ్య 59.63 లక్షలకు, మధుమేహ బాధితుల సంఖ్య 48.95 లక్షలకు చేరింది. వీరిలో సుమారు 34 లక్షల మందికి రెండు వ్యాధులూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సర్వేలో 3,339 నోటి క్యాన్సర్, 5,832 రొమ్ము క్యాన్సర్, 3,597 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు కలిపి మొత్తం 12,768 క్యాన్సర్ కేసులను గుర్తించారు. సర్వే ఫలితాల నివేదికను కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్హెచ్ఎం ఎండీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందజేశారు.
14 నెలల్లో 2.86 కోట్ల మందికి పరీక్షలు
గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ సర్వే నవంబర్ 10తో ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించారు. 18 ఏళ్లు దాటిన వారిలో బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేశారు.
రక్తంలో చక్కెర స్థాయులు, రక్తపోటును ప్రాథమికంగా పరీక్షించి అనుమానితులను వైద్యుల వద్దకు పంపించారు. అక్కడ మరిన్ని పరీక్షలు, వైద్య పరిశీలన అనంతరం వ్యాధులను నిర్ధారించారు. వ్యాధులు నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు, వైద్య సేవలు అందించారు.

60 ఏళ్లు దాటిన వారిలో అధిక కేసులు
వయస్సుల వారీగా పరిశీలిస్తే 60 ఏళ్లు పైబడిన వారిలోనే బీపీ, మధుమేహం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం బీపీ కేసుల్లో 47.60 శాతం, మధుమేహం కేసుల్లో 43.39 శాతం ఈ వయస్సు వారే ఉన్నారు. 50–59 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ రెండు వ్యాధుల కేసులు గణనీయంగా ఉన్నాయి.
40–49 ఏళ్ల వారిలో 9,99,833 బీపీ కేసులు, 9,22,583 మధుమేహ కేసులు గుర్తించారు. 30–39 ఏళ్ల వయస్సు వారిలో 2,89,865 మందికి బీపీ, 2,86,680 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. 20–29 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 81,983 బీపీ, 75,431 మధుమేహ కేసులు నమోదయ్యాయి. 18–19 ఏళ్ల వయస్సు వారిలోనూ 11,827 బీపీ, 10,360 మధుమేహ కేసులను గుర్తించారు.
జిల్లాల వారీగా గుర్తించిన కొత్త కేసులు
NCD 4.0 సర్వేలో కొత్తగా గుర్తించిన బీపీ కేసుల్లో విశాఖపట్నం 78,017, పశ్చిమగోదావరి 68,802, తిరుపతి 65,504, తూర్పుగోదావరి 64,116, వైఎస్సార్ కడప 63,141 కేసులతో ముందున్నాయి.
మధుమేహం కేసుల్లో విశాఖపట్నం 80,692, పశ్చిమగోదావరి 67,935, తిరుపతి 67,827, వైఎస్సార్ కడప 66,914, ప్రకాశం 61,415 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల శాతం పరంగా తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో బీపీ కేసులు అధికంగా ఉండగా, మధుమేహం కేసుల్లో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, ఏలూరు జిల్లాలు ముందున్నాయి.
12,768 క్యాన్సర్ కేసుల గుర్తింపు
క్యాన్సర్ స్క్రీనింగ్‌లో భాగంగా అనుమానిత కేసులను గుర్తించి తదుపరి వైద్య పరీక్షలకు పంపించారు. నోటి క్యాన్సర్‌కు సంబంధించి 9.96 లక్షల అనుమానిత కేసులను పరిశీలించి, 23,009 మందిని పెద్ద ఆసుపత్రులకు పంపగా 3,339 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. రొమ్ము క్యాన్సర్ అనుమానంతో 15,374 మంది మహిళలను పెద్ద ఆసుపత్రులకు పంపగా 5,832 కేసులు నిర్ధారణ అయ్యాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి 19,429 మందిని పరిశీలించగా 3,597 కేసులు వెలుగులోకి వచ్చాయి.
జీవనశైలి వ్యాధుల నియంత్రణకు ప్రాధాన్యం: మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, తీవ్రత పెరగకుండా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్‌ను కూడా ప్రాథమిక దశలో గుర్తించేందుకు పరీక్షలను విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధులు గుర్తించిన వారికి ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.


