
ఆగ్నేయ బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ రేపు అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్రవాయుగుండంగా, అలాగే సాయంత్రానికి దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారానికి తీవ్రతుపాన్ గా మారే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళద్దు..
దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వాతావరణ పరిస్థితులని నిశితంగా పర్యవేక్షిస్తూ తుపాన్ పయన మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.


