ap news

వైసీపీది దిక్కుమాలిన… దాష్టిక పాలన

  • ఈ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటాం
  • ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు
  • క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధం
  • పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడాం…
  • 25.2% ఓట్లు సాధించాం
  • జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోంది పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ఫలితాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని కలిగించాయి. రాష్ట్రంలో వైసీపీది దౌర్భాగ్యపు… దిక్కుమాలిన… ఇలాంటి దాష్టికపు పాలన మన దేశంలో ఎక్కడా లేదు. పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్ధులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారు. వైసీపీ దాష్టిక పాలన చూసి ఓపిక నశించింది. 151 మంది గెలిచారు. మంచి పాలన అందిస్తారని అనుకున్నాం కానీ దాడులు, బెదిరింపులతో పాలన చేస్తున్నారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి… క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం. ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం.
  • జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పరిషత్ ఎన్నికలు నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ జరిగిన విధానం చాలా బాధ కలిగించింది. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నామని మాటలు చెప్పిన ప్రభుత్వం… మరో వైపు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు.
• మార్పునకు ఇది సూచిక
ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై… మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచాం. అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు. గెలుపొందింది 177. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మా పార్టీ మద్దతుతో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే… పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన స్థానాలు గెలుపొందిన స్థానాలను ప్రాతిపదికన తీసుకొని ఈ విషయం చెబుతున్నాం. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో రెండు స్థానాల్లో మా అభ్యర్థులు గెలిచారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నాం. పవర్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక సూత్రాలకు నిలబడి సాధించిన ఈ విజయం బలమైన మార్పుకు సంకేతం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలే గెలిచింది. కానీ ఆ గెలుపు మార్పుకు సంకేతం. ఈ రోజు వాళ్లే తెలంగాణలో విజయబావుట ఎగరవేశారు. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజు మా జనసేన విజయం చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ సంపూర్ణ మార్పుకు ఇది బలమైన పాదముద్ర.
• ఫించన్ తీసేస్తాం… ఇళ్ల స్థలం ఇవ్వం… రేషన్ కట్ అని బెదిరించారు
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయకపోతే ఫించన్ నిలిపివేస్తాం, రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లతో బెదిరించారు. ఇతర పార్టీల అభ్యర్ధుల ఆర్థిక మూలలపై దాడులు చేశారు. మరి కొన్నిచోట్ల స్వయంగా మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ నిలబడిపోయింది. పొత్తులో భాగంగా మిత్రపక్షమైన బీజేపీకి కొన్ని స్థానాలు కేటాయించాం. దానివల్ల కూడా జనసేనకు కొద్దిగా ఎంపీటీసీ సీట్లు తగ్గాయి. లేకుంటే ఇంకాస్త ఎక్కువ స్థానాలే వచ్చేవి. అన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్ధులు బరిలో లేకపోవడం జెడ్పీటీసీ అభ్యర్ధులకు ప్రతికూలంగా మారింది. అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం కూడా చిన్న లోటుగా అనిపించింది.
• పోలీసులే బలవంతంగా విత్ డ్రా చేయించారు
ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితులు వేరు. ఈ రోజు పరిస్థితులు వేరు. ఇప్పుడుగానీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే జనసేన పార్టీ కచ్చితంగా 1500 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలు, 40 నుంచి 80 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకునేదని పరిశీలకులు చెబుతున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మా నాయకురాలు శ్రీమతి వినుతపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. అలాగే చిత్తూరు జిల్లా రేణిగుంటలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య, పీఏసీ సభ్యులు డా.హరిప్రసాద్ లపై పోలీసుల సమక్షంలో బూతులు తిడుతూ దాడులు చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జనసేన తరపున ఐదుగురు నామినేషన్లు వేస్తే వారితో పోలీసులే బలవంతంగా విత్ డ్రా చేసుకునేలా చేశారు. అక్కడ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తించారు. మైసూరువారి పల్లెలో జనసేన అభ్యర్ధిని బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు. శ్రీ నాగరాజుని పార్టీ నిలబెడితే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారు. వైసీపీ దుర్గ్మార్గపు పాలన ఎలా ఉంది అంటే – ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటికీ ఆయన రిమాండ్ లో ఉన్నారు. కడప జిల్లావ్యాప్తంగా 559 ఎంపీటీసీ స్థానాలకు గానూ 28 చోట్ల మా నాయకులు నామినేషన్లు వేస్తే ఎలక్షన్ సిబ్బంది, ఇతర అధికారులు కుమ్మకై స్క్రూటినీలో రకరకాల కారణాలు చూపి నామినేషన్లు తొలగించారు. వల్లూరు ఎంపీటీసీ అభ్యర్ధిని కిడ్నాప్ చేసి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో శ్రీ జోజిబాబు అనే జనసైనికుడు పెద్దకొండూరు ఎంపీటీసీగా 65 ఓట్ల తేడాతో నెగ్గితే… వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మిగతా సిబ్బంది మద్దతుతో రీకౌంటింగ్ 18 ఓట్లు తేడాతో ఓడిపోయాలా చేశారు. అనంతపురం జిల్లా తాడిమర్రిలో జనసేన అభ్యర్ధుల నామినేషన్లను వేయకుండా వైసీపీ గూండాలు అడ్డుకున్నారు. జనసేన నాయకులకు మద్దతుగా వెళ్లిన పీఏసీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డిపై దాడి చేశారు. యాడికిలో నామినేషన్లు వేసిన శ్రీ సునీల్, శ్రీ జాకీర్ హుస్సేన్ ఇళ్లల్లోకి వెళ్లి బెదిరింపులకు దిగారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోకపోతే మద్యం, గుట్కా ప్యాకెట్లు ఇళ్లల్లో పెట్టి అక్రమ రవాణా చేసున్నారనని కేసులు పెడతామని బెదిరించారు. ఉరవకొండలో అయితే నామినేషన్ పత్రాలను అపహరించారు. పుంగునూరులో నామినేషన్ వేసిన ఒక పెద్దాయనపై దాడికి ప్రయత్నించారు.
• వైసీపీ నాయకుల హింస పేట్రేగిపోతోంది
కడియం మండలం వీరవరంలో గెలిచిన అభ్యర్ధులు సంబరాలు చేసుకుంటే విచక్షణ రహితంగా వైసీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారు. కర్రకు మేకులు కొట్టి, బ్లేడ్లతో దాడులు చేయడంతో శ్రీ కొత్తపల్లి అయ్యప్ప అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. ఇప్పటికీ ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. వైసీపీ నాయకుల హింస పెట్రేగిపోతోంది.
జనసేన పార్టీ డిమాండ్ చేసినట్లు పాత నోటిఫికేషన్ బదులు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లు అయితే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రత్యర్ధి పార్టీలకు సరైన సమయం కూడా లేకుండా పోయింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు కూడా వైసీపీ దాష్టికానికి వంతపాడారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కడియం, రాజోలు, పి.గన్నవరం, మలికిపురం, ఆచంట, వీరవాసరం మండలాల్లో జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఈ విజయం బలమైన మార్పుకు పునాది. పార్టీ మూల సూత్రాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం సత్ఫలితాలను ఇచ్చింది. ఇవాళ గెలుపొందిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారు. సామాన్యులు గెలుపొందడం ఆనందాన్ని ఇచ్చింది. ఇంతటి విజయానికి ముఖ్యకారకులైన జనసైనికులు, వీరమహిళలకు ధన్యవాదాలు. వీరే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేదే కాదు. మీ ధైర్యానికీ, తెగింపునకు సెల్యూట్.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *