ap news

ప్రజలను తప్పు దోవ పట్టించొద్దు : డీజీపీ

అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని డీజీపి గౌతం సవాంగ్ కొందరు రాజకీయ నాయకులకు హితవు పలికారు. డ్రగ్స్ రవాణాపై పదే పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడం వలన ప్రజలలో అనేక అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉంది.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచి పోవడం బాధాకరం.గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముండ్రా పోర్ట్ లో డి‌ఆర్‌ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమీషనర్ గారు ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదు అని చెప్పినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ ప్రస్తాపించడం సరికాదు.

వివిధ పత్రికలు, టీవీ చానళ్లు సైతం ఈ అంశంపై పలు కథనాలను ప్రచురిస్తూ, డిల్లీ, నోయిడా, చెన్నయి, ముండ్రా లలో స్వాధీనాలు, అరెస్టుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్న విషయం విదితమే. నేరం యొక్క ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకుడు అపోహలు సృష్టించడం భావ్యం కాదు.

ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ఈ విషయాన్ని ఇప్పటికే డీఆర్ఐ అధికారులు మరియూ కేంద్ర సంస్థలు ధృవీకరించాయి.

హెరాయిన్ ను విజయవాడకి కానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆఫ్గనిస్థాన్ నుండి ముండ్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్ ఐ మరియూ కేంద్ర సంస్థల అధికారులు పేర్కొంటున్నారు.

అన్ని అంశాలపై డీఆర్ఐ మరియూ కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయన్న విషయాన్ని మనమందరం గుర్తించాలి.

కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని మనవి.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *