పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి
జనసేన నేతల డిమాండ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ పట్ల ఏకపక్షంగా, అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన పేర్ని నానిని సభ్య సమాజం చీ కొడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ యదార్దాలు మాట్లాడితే నీకెందుకు ఉలుకు అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడానికి జనసేన పార్టీ ముందుంటుందనీ, తిరిగి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పేర్ని ఇంటి ముట్టడికి సిద్ధమని బండి రెడ్డి హెచ్చరించారు.
నియోజకవర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ మాట్లాడుతూ విలువలు తో కూడిన రాజకీయాన్ని స్వాగతించాలని అన్నారు. రాజకీయాల్లో పరస్పర దూషణలు తో వచ్చే లాభాలు లేవని అన్నారు. తమ పార్టీ క్రమశిక్షణతో కోరుకోవడం వల్ల తమ కార్యకర్తల సహనంతో ఉన్నారని, కార్యకర్తలుని రెచ్చ కొట్టవద్దని బండి రామకృష్ణ అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మచిలీపట్నం శాసనసభ్యునిగా రవాణా శాఖ మంత్రిగా గడిచిన రెండు సంవత్సరాలుగా మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఆర్టీసీ డిపో అభివృద్ధికి, బందరు పోర్టు అభివృద్ధి కి, రద్దయిన మచిలీపట్నం తిరుపతి రైలు, అడ్రస్ లేకుండా పోయిన అండర్ డ్రైనేజి కి సమాధానం చెప్పాలని అన్నారు.కాపు కులాన్ని అసభ్యకరంగా దూషించడం తగదని బాలాజీ అన్నారు.
సర్పంచ్ గళ్ళ తిమోతి మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గం లో మత్స్యకార గ్రామాలు మంచినీళ్లు లేక అల్లాడుతున్న గ్రామాల్లో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరుదు రమాదేవి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మహిళలందరూ ఖండిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు వీర మహిళలు డివిజన్ ఇంచార్జి పాల్గొన్నారు