వ్యాక్సిన్ ధృవపత్రంతో రావాలి

  • తిరుమల కొండ మీదకు రావటానికి
  • వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి 
  • టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ టీకా తీసుకున్న ధ్రువీకరణపత్రాలతోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాలు మీనలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగానే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయ కల్యాణమండపంలో వాహనసేవలు జరుగుతాయన్నారు. ఆగమోక్తంగా అన్ని వైదిక కార్యక్రమాలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ నెల 15న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని, చక్రస్నానం కూడా ఆలయంలో ఏకాంతంగానే జరుగుతున్నారు. ఈ నెల 11న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. పర్యటనలో సీఎం పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్నారు. బర్డ్‌ ఆసుపత్రిలో చిన్నపిల్లల గుండె చికిత్సశాల, అలిపిరి గోశాల, నడక మార్గానికి సీఎం ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అలిపిరి నడక మార్గాన్ని రూ.25కోట్లతో ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. అలాగే తిరుమలలో కొత్త బూందీ పోటును.. ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానెళ్ల ప్రసారాలు సీఎం ప్రారంభిస్తారన్నారు.

చానెళ్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై హాజరవుతారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మందికి స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి 15వ తేదీ వరకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామని.. ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు. ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి పిల్లలకు ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమవుతాయన్నారు. నెల రోజుల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బర్డ్‌ ఆసుపత్రిలో రూ.25కోట్లతో చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధి చేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published.