నేటి నుంచి శ్రీవారి బ్రహ్మత్సవాలు
- 11న ముఖ్యమంత్రి చేతుల మీదుగా
- స్వామివారికి పట్టు వస్త్రాల అందజేత
- టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మాత్సావాల్లో భాగంగా ఈనెల 11 సాయంత్రం గరుడసేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా తిరుమలలో కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారని తెలిపారు.
ఇవీ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
అక్టోబరు 7వ తేదీ గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామనీ, గరుడసేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు నిర్వహిచనున్నట్టు తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండడం వల్ల స్వర్ణరథం, రథోత్సవం ఉండవుె..వీటికి బదులు సర్వభూపాల వాహనసేవ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 15వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారనీ..ఈ ఏడాది కూడా కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు.
సీఎం ప్రారంభోత్సవాలు..
– తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్‌లో తాత్కాలికంగా రూ.25 కోట్లతో వ్‌యంతో నిర్మించిన చిన్నపిల్లల పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ప్రారంభం.
– అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత రూ.15కోట్ల విరాళంతో నిర్మించిన గోమందిరం ప్రారంభం. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేపట్టారు.
– రూ.25 కోట్ల వ్యయంతో దాత పునఃనిర్మించిన అలిపిరి నుంచి తిరుమల నడకదారి పైకప్పు ప్రారంభం.
అక్టోబరు 12న
– తిరుమలలో ఇండియా సిమెంట్స్ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటు ప్రారంభం.
మీడియా సమావేశంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.