ప్రతి గ్రామానికి ఇంటర్నెట్
• ప్రతి 5 కిలో మీటర్లకు ఒక టవర్ ఏర్పాటు.
• భవిష్యత్ లో ఆర్ధిక వనరు సంస్థగా ఏపీఎస్ఎఫ్ఎల్..
• రాబోయే కాలంలో కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతంరెడ్డి
ఏడాది కాలంలో సంస్థ పురోగతిని వివరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజల ముంగిట అందించడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతికతతో ఇంటర్నెట్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కృషి చేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి తెలిపారు. ఇంటర్నెట్ వైర్ ద్వారానే వెళ్లే ఆనవాయితీ భారత దేశమంతా ఉందని.. కానీ ఆంధ్రప్రదేశ్ లో 5 కిలో మీటర్ల దూరంలో ఒక టవర్ ను ఏర్పాటు చేసి ఆ టవర్ నుంచి మరో టవర్ కి కనెక్ట్ చేసి వైర్ లెస్ ఇంటర్నెట్ అందించే విధంగా ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందని, చిత్తూరులో ట్రయల్ రన్ గా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. బాక్స్ సిస్టం ద్వారా నెట్ ను అందించేందుకు.. 4. 5 కంపెనీలు మందుకొచ్చాయన్నారు. ఇంటర్ నెట్ ను ఇంటింటికీ అందించేందుకు ఫైలట్ ప్రాజెక్టుగా త్వరలో విజయవాడలో మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని.. తద్వారా అతి తక్కువ రేట్లలో ఇంటింటికీ నెట్ ను అందజేస్తామన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో గల ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ యొక్క అభివృద్ధి, పురోగతి.. గత ప్రభుత్వం చేసిన విధానాలు, వాటిల్లో వచ్చిన అవతవకలపై జరిగిన సమీక్షా వివరాలను ఛైర్మన్ పి. గౌతంరెడ్డి వివరించారు.
ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్ వర్క్ ఆఫరేషన్ సెంటర్ (ఎన్ఏసీ) చిన్నదిగా ఉండడంతో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆధునాతన ఎక్విప్ మెంట్ తో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తాను ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరకాలంలో అత్యధిక కాలం కోవిడ్ సమయమైనా.. సంస్థ అభివృద్ధి చర్యలు ఎక్కడా ఆగలేదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేశామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ విధానాలను ప్రజల ముందుంచేందు కోసం ముఖ్యమంత్రి కార్యాలయం లో నిర్వహించే సమీక్షా సమావేశాలను SD-WAN సిస్టమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆఫీసులకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారం చేస్తుందని గౌతంరెడ్డి తెలిపారు.