నిలబడటం అంటే
నిలబడటం అంటే
మనిషి కోసం
మట్టి కోసం
దేశం కోసం
సమత కోసం
మమత కోసం నిలబడటం.
జవాబు కోరే ప్రశ్న కోసం
అశాస్త్రీయత రుజువు పర్చడం కోసం
వివక్షపై ఉరిమి చూడటం కోసం
అక్రమంపై
ఉమియడం కోసం నిలబడటం.
అట్టడుగు మనిషి మీద ప్రేమ కోసం
అమ్మల హక్కుల కోసం
ఆడబిడ్డల్ని కాపాడుకోసం
హింసల నిరోధం కోసం
అక్షరాల ఆత్మ వికాసం కోసం
దృష్టి పథం విశాలం కోసం నిలబడటం.
వీటిల్లో వేటికీ కొరగాని
విగ్రహాలూ నిలబడుంటాయి.
వాటి ముందూ
ఎన్నో తలకు అర్హత లేని
తలలూ నిలబడి ఉన్నట్టు కల గంటాయి.
నిలబడటం అంటే
ప్రశ్నయి నిలబడటం
ఊరి ఫ్యూడల్ దాష్టీకం మీద ఉరుముతో
జవాబయి నిలబడటం.
నిలబడి ఉన్నోళ్ళందరికీ
కాళ్ళున్నట్టు కాదు.
కాళ్ళున్నోళ్లంతా నిలబడినట్టూ కాదు.
నిలబడటం కూడా
ఇక ప్రాక్టీస్ చేయాలని వుంది.
