ap news

శ్రీభాగ్ కోసం సీమ సత్యాగ్రహం

-శ్రీభాగ్ ఒప్పందం అమలు జరిగే వరకు రాయలసీమ ప్రజల సత్యాగ్రహం కొనసాగుతుందని హెచ్చరిక.

-భాషా ప్రయోక్త రాష్టం ఏర్పాటు చేయడానికి దారితీసింది శ్రీభాగ్ అవగాహనతోనే.

-దగాపడ్డ రాయలసీమకు శ్రీ బాగ్ ఒప్పందం అమలుతోనే న్యాయం.

-శ్రీభాగ్ అవగాహనకు నేటితో 84 వసంతాలు పూర్తి.

-దగా పడ్డ సీమకు న్యాయం జరగలాంటే శ్రీభాగ్ అమలు చేయడం మినహా మరో మార్గం లేదు.

-శ్రీభాగ్ లోని కీలక అంశం కృష్ణా,తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్.

-రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు రాసి ఇచ్చిన హామీ పత్రం శ్రీభాగ్ అమలుకు నోచుకోకపోవడం వల్లే నేడు రాయలసీమ కరువు సీమగా మిగిలింది.

-అందుకు అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రాయలసీమ మేధావుల ఫోరం సదస్సు.
అభిప్రాయపడ్డ మేధావులు.

ఎస్వీయూలో రాయలసీమ సత్యాగ్రహ సంఘీభావ సమావేశంలో మేధావులు,వక్తలు.
తెలుగు భాషా ప్రయుక్త రాష్ర్టం ఏర్పాటు సందర్భంగా రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు రాసి ఇచ్చిన హామీ పత్రం శ్రీభాగ్ అమలుకు నోచుకోకపోవడం వల్లే నేడు రాయలసీమ కరువు సీమగా మారిందని రాయలసీమ మేధావుల ఫోరం ఏర్పాటుచేసిన సత్యాగ్రహ సంఘీభావ సమావేశంలో మేధావులు,వక్తలు అభిప్రాయపడ్డారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటిలోని సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఆసియన్ అండ్ పెసిఫిక్ స్టడీస్ సెమినార్ హాల్ లో సత్యాగ్రహ సంఘీభావ సమావేశం మంగళవారం జరిగింది.దగాపడ్డ రాయలసీమకు శ్రీభాగ్ ఒప్పందం అమలుతోనే న్యాయం అని నినదిస్తూ ఈ రోజు సమావేశంలో వక్తలు మాట్లాడారు.శ్రీ భాగ్ ఒప్పందం జరిగి (1937,నవంబర్ 16) నేటికి 84 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలను రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి తెలియచేశారు.అవి ఏమంటే…..

శ్రీభాగ్ నేపధ్యం…

1953 కి పూర్వం నేటి సీమాంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నది. తెలంగాణ నైజాం పాలనలో ఉన్నది. 1913 లో తొలి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది. ఈ వేదిక ప్రాధమిక ఉద్దేశ్యం తమిళుల ఆధిపత్యం నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు కావడం. కోస్తాంధ్ర పెద్దలు మాత్రమే హాజరు అయిన ఈ సభలకు రాయలసీమ ప్రాంతం నుంచి హాజరు కాలేదు. సీమ ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రంగా విడిపోవడం సాద్యం కాదని గుర్తించిన కోస్తాంధ్ర పెద్దలు రాయలసీమ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకోవడానికి 1917 ఒక కమిటీని ఆంధ్ర మహాసభ నియమించినది.. ఈ కమిటీ సీమలో పర్యటించిన తర్వాత రాయలసీమ ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు. రాయలసీమ ప్రజలు కోస్తాంధ్ర తో కలిపి మద్రాసు నుండి విడిపోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దానికి కారణం.
1. అప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ , నేటి ప్రకాశం బ్యారేజి లు అందుబాటులో కి వచ్చి వ్యవసాయం వృద్ధి చెందింది.
2. ఆంగ్లేయులు పాలనలో కోస్తాంధ్ర ప్రాంతం ఉన్నందున విద్యాభివృద్ధికి అవకాశం ఏర్పడింది. విద్యా , వ్యవసాయం అభివృద్ధి చెందడం. ప్రాంతంగా పెద్దది కావడం వల్ల సమీపంలోని మద్రాసును వదులుకుని రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర తో కలిపి రాష్ట్రంగా ఏర్పడటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సమయంలోనే మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. 1926 లో జరిగిన ఆంధ్రమహాసభ అనంతపురంలో ఆంధ్రా యూనివర్సిటీని నెలకొల్పేందుకు తీర్మాణం చేసింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై 1927 లో చర్చ జరిగింది. తెలుగు ప్రాంతం విషయం కనుక తమిళ ప్రాంతానికి చెందిన సభ్యులు చర్చకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి చూచించారు. ఆంధ్రమహాసభ తీర్మానాన్ని విస్మరించి కోస్తాంధ్ర ప్రతినిధులు విశ్వవిద్యాలయంను అనంతపురంలో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు చేశారు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి మాటను కాదని 8 మంది తమిళ ప్రజా ప్రతినిధులు రాయలసీమకు అనుకూలంగా ఓటు వేయడం వల్ల ( 25 మంది విజయవాడలో 35 మంది అనంతపురంకు అనుకూలంగా ఓటు వేశారు) తీర్మాణం నెగ్గింది. అన్నింటినీ విస్మరించి మొదట విజయవాడ అని తర్వాత విశాఖలో నెలకొల్పారు. రాయలసీమ నేతలు మళ్ళీ పునరాలోచనలో పడ్డారు తమిళిలు కన్నా కోస్తాంధ్ర వారితోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆలాంటి వారితో కలిపి రాష్ట్రంగా ఎలా ఏర్పాటుకు సిద్దపడాలని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకున్నదే శ్రీభాగ్ అవగాహన. 1937 అక్టోబరు 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీ నాదుని నాగేశ్వరరావు పంతులు స్వగృహంలో ( ఇంటి పేరు శ్రీభాగ్ ) కోస్తాంధ్ర , సీమ పెద్దల మధ్య కుదిరిన అవగాహన కనుక శ్రీభాగ్ అవగాహనగా పెరు వచ్చింది.

శ్రీభాగ్ అవగాహన పై తప్పుడు ప్రచారం..

శ్రీభాగ్ అవగాహన ఒక పార్టీలోని రెండు గ్రూపుల మధ్య జరిగిన ఒప్పందం. దానికి చట్టబద్ధత లేదు అంటూ శ్రీభాగ్ పై తమ అభిప్రాయం చెప్పే నిజాయితీ లేని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం. 1937 లో అవగాహన కుదిరింది. అంతకు ముందే ఆంధ్ర మహాసభలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నాటికి కాంగ్రెస్ స్వాతంత్ర్య ఉద్యమ వేదిక అన్ని భావజాలాలు కలిగిన వారు అందులో భాగమే. 1947 తర్వాతే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. కాసినాధుని నాగేశ్వరరావు , పట్టాభిసీతారామయ్య , కొండా వెంకటప్ప నాయుడు , పప్పూరి రామాచార్యులు , కోటిరెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు మధ్య కుదిరిన ఒప్పందాన్ని రెండు గ్రూపులు మధ్య కుదిరిన అవగాహనగా చిత్రీకరణ చేయడం దుర్మార్గపు చర్య. నేడు రాజకీయ హామిగా ఉన్న ప్రత్యేక హోదా మా హక్కు అంటున్న వారికి చట్టం చేయలేదు కాబట్టి శ్రీభాగ్ అవగాహనకు చట్టబద్దం కాదు అని మాట్లాడే అర్హత లేదు.

  • రాయలసీమ సమగ్రాభివృద్ధికి శ్రీభాగ్ అవగాహన అమలుతోనే సాద్యం.
  • రాయలసీమ ప్రజలకు కోస్తాంధ్ర పెద్దలు రాసి ఇచ్చిన హామీ పత్రం శ్రీభాగ్

1. రాజధాని.. మద్రాసు నుండి విడిపోయే నాటికి మద్రాసు రాయలసీమ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద నగరం అలాంటి నగరాన్ని వదులుకుంది సీమ. శ్రీభాగ్ అవగాహన మేరకు కర్నూలు లో రాజధాని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. 1956 లో తెలంగాణ తో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు కోసం రాయలసీమ మరోమారు రాజధాని నగరాన్ని త్యాగం చేసింది. 2014 విభజన అంశం మీద వేసిన శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ ప్రాంతంలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదని అన్ని గ్రామీణ స్వభావం కలిగి ఉన్న పట్టణాలు మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నది. ఒక సారి మద్రాసు , రెండవ సారి కర్నూలు రాజధానిని కోల్పోయిన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయడం కనీస ధర్మం. 2014 విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీమ ప్రాంతానికే చెందిన వ్యక్తి అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన రాజధానిని అమరావతిలో ఏర్పాటుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కనీసం హైకోర్టు కూడా ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ , గుంటూరు లాంటి నగరాలు ఉన్న చోటే మరో కొత్త నగరం నిర్మాణానికి పూనుకున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలను కనీసం పట్టించుకోలేదు.

నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

శ్రీభాగ్ లోని మరో కీలక అంశం కృష్ణా , తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రయోజనాల కోసం వినియోగించాలి. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అందుకు భిన్నంగా పరిణామాలు జరిగాయి. కృష్ణా పెన్నారును పక్కన పెట్టేసారు. శ్రీశైలం ప్రాజెక్టును 85 వేల ఎకరాల రాయలసీమ ప్రజల త్యాగలతో నిర్మించినా అది సీమకు ఉపయోగ పడకుండా సాగర్ , తెలంగాణకు బ్యాలెన్స్ రిజర్వాయర్ గా మారింది. ఏకంగా నేడు తెలంగాణ సీమకు శ్రీశైలం నుంచి నీరు తీసుకునే హక్కే లేదని వాదిస్తోంది. నీటి హక్కులు లేకపోవడం , అధికారికంగా ఉన్న 137 .7 టీఎంసీల నీటిని సరఫరా , నిల్వ చేసుకునే ప్రాధమిక ఏర్పాటు కూడా రాయలసీమలో జరగలేదు. ఆంగ్లేయులు నిర్మించిన KC కెనాల్ , వైయస్ నిర్మించిన గండికోట తప్ప చెప్పుకోదగ్గ రిజర్వాయర్ లు సీమలో లేవు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో అన్నమాట ” రాయలసీమలో వరదలు వచ్చినా శ్రీశైలం నుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతున్న నీరు వాడుకోలేని దుస్థితి రాయలసీమ ప్రజలది ” ఈ వ్యాఖ్యలు రాయలసీమ లోని పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అర్థం లేని వాదనలు ఒక వైపు శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 కి పడిపోయింది. వచ్చిన నీరు వచ్చినట్లు సముద్రం పాలు అవుతుంది. వరదలు ఉన్నా అవి స్వల్ప కాలం ఉంటుంది. అంటే రాయలసీమకి నీరు అందించాలంటే. పోతిరెడ్డిపాడు వెడల్పు , శ్రీశైలం ఎగువ నుంచి వరదల సమయంలో త్వరితగతిన నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవడం , సిద్దేశ్వరం , గుండ్రేవుల ప్రాజెక్టులు , కాల్వల , రిజర్వాయర్ ల సామర్థ్యం పెంచడం , చెరువుల పునరుద్ధరణ , ముఖ్యంగా దుమ్ముడూడెం పథకాన్ని పునరుద్ధరణ చేయడం నేడు ప్రభుత్వం చేయాలి. అప్పుడే రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.

అమరావతి పెద్దలు చరిత్రను మరిచి పోకూడదు

నేడు రాజధాని అమరావతి లోనే ఉండాలని రాయలసీమ , ఉత్తరాంధ్రలో ఎలాంటి రాజధానితో ముడిపడిన కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదంటూ పోరాటం చేస్తున్నారు. 1953 లో మద్రాసు నుండి విడిపోయే సమయంలో కోస్తాంధ్ర పెద్దలు రాయలసీమ ప్రజలకు రాసి ఇచ్చిన హామీ పత్రం శ్రీభాగ్ ను మరిచిపోకూడదు. రాజధాని , నీటి ప్రాజెక్టుల నిర్మాణం రాయలసీమలో మొదట జరగాలి. నేడు హైకోర్టు రాయలసీమ లో ఏర్పాటు చేస్తామన్నా మేము అంగీకరించమంటూ ఆందోళన చేపట్టారు. రాజధాని మాకు ఇవ్వండి మిగిలిన అభివృద్ధి రాయలసీమ , ఉత్తరాంధ్ర లో చేసుకొండి అంటూ మాట్లాడుతున్నారు. బారి వ్యయం తో రాజధాని నిర్మాణం పని ప్రభుత్వం చేస్తే ఇక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చు ఎలా చేస్తారు. హైకోర్టు కూడా రాయలసీమకు ఇవ్వరాదు అంటున్న వారు వారి పని అయిన తర్వాత రాయలసీమ నీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు ఖర్చు చేస్తే అంగీకరిస్తారని ఎలా నమ్మాలి. 1953 మద్రాసు నుండి విడిపోయే నాటి నుంచి ప్రతి అంశంలోనూ మధ్య కోస్తా పెద్దలు తమ కోసం అందరూ తప్ప అందరి కోసం తాము కాదు అన్న పద్దతిలో వ్యవహరిస్తున్నారు. ఫలితం నమ్మి వచ్చిన రాయలసీమ ప్రజలు దగా పడ్డారు. 84 వసంతాల ముందు చేసుకున్న శ్రీభాగ ఒప్పందంలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగించడం నేటి పాలకుల బాధ్యత.

రాయలసీమ ప్రజలు శ్రీభాగ్ అమలు కోసం ఉద్యమించాలి. రాజధాని మార్పులు తగిన వాటా సాధించాలి. నీటి హక్కుతో కూడిన ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. రాయలసీమ ప్రజల నిర్లిప్తత సీమకు శాపంగా మారింది. ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు న్యాయంగా రావాల్సిన వాటా కోసం పోరాటం తప్పదు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏకపక్షంగా అమరావతిని బలపరుస్తున్నాయి అంటే రాయలసీమ ప్రజల పట్ల చులకన భావం తప్ప మరోటి కాదు రాజధాని , నీటి సమస్య పరిష్కారానికి చర్యలు విషయంలో రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచేందుకు రాయలసీమ సమాజం తగిన ప్రయత్నం చేయాలి. సమావేశంలో ప్రొఫెసర్లు జయచంద్రారెడ్డి,నాగోలు కృష్ణారెడ్డి,కృష్ణమోహన్,మురళి,నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *