ఆరోగ్యశ్రీ కోసం రూ 1790 కోట్లు
ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ 199.5 కోట్ల చెల్లింపు
ఈహెచ్ ఎస్ నెట్ వర్క్ ఆసుపత్రులకు జూలై 2022 వరకు క్లెయిమ్ ల కింద రూ.199.5 కోట్లు చెల్లించామని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(CEO) యమ్.యన్ హరేందిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఎలాంలి చెల్లింపులు చేయలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.1790 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల బిల్లుల కోసం తాము వినియోగించలేదని ఆయన స్పష్టం చేశారు.2022 – 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.1790 కోట్ల నిధులను ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం వినియోగించగా రూ.199.5 కోట్లు ఈహెచ్ఎస్ నెట్వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించామన్నారు. 2022-23 సంవత్సరానికి గాను 3,25,390 మంది లబ్దిదారులు ఈహెచ్ ఎస్ పథకం ప్రకారం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స పొందారని వెల్లడించారు.