ap news

నిర్బంధాలకు వెరవం : పవన్ కళ్యాణ్

ప్రజాస్వామ్యంలో మనమంతా భాగం. అంతా ఒక్కటైతేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నాకు నచ్చని వాళ్లు ఉండకూడదు..బతక్కూడదు అంటే కుదరదు. మానవాళికి దక్కిన గొప్ప వరం ప్రజాస్వామ్యం. ఆ విలువలను మనం కాపాడుకోవాలి. ఇది మా భూమి.. మా నేల. మేం ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం ఇక్కడే ఉంటాం అని పోరాడి చెబుదాం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, నిర్భందాలకు వెరవబోమన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం మారాలంటే ప్రజాస్వామ్య పంథాలో సమష్టిగా చేసే బలమైన పోరాటాలే సరైన మార్గం అన్నారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమని చెప్పారు. విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై.. గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిలుతో విడుదలైన తొమ్మిది మంది జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులతో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

కోన తాతారావు,  సుందరపు విజయ్ కుమార్,  సందీప్ పంచకర్ల, పీవీఎస్ఎన్ రాజు,  పీతల మూర్తి యాదవ్, శ్రీమతి కొల్లూరు రూప, శ్రీ రాయపురెడ్డి కృష్ణ, శ్రీ శ్రీనివాస పట్నాయక్, శ్రీ చిట్టిబిల్లి శ్రీనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ నా పిల్లలకు మంచి చదువు ఇవ్వగలను.. డబ్బులు ఇవ్వగలను.. మంచి ఇల్లు, బట్టలు, వారికి కావల్సిన సౌకర్యాలు ఇచ్చే అవకాశం నాకుంది. కానీ వారు బతికేందుకు మంచి సమాజాన్ని తీసుకురావాలంటే నేనేం చేయాలి అన్న ఆలోచనే నన్ను రాజకీయాల వైపు నడిపించింది. ఈ రోజు నా కుటుంబం అంటే జనసేన సమూహమంతా. ఈ ప్రజలందరూ నా వాళ్ళే అనుకుంటా. సమూహంగా ఉండే సమాజంలో కేవలం నా ఒక్కడి వల్లనే అద్భుతాలు జరిగిపోతాయి అంటే నమ్మను. మంచి ఆలోచనలతో కూడిన బలమైన సమూహం తయారు చేసేందుకే జనసేన పార్టీని వేదికగా నిర్మించాను. నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు చట్టం ఒకరికే ఎందుకు బలంగా పనిచేస్తుంది అన్న ఆలోచనల నుంచి పుట్టిన నా పయనం ఈనాడు ఒక బలమైన ఆలోచనల సమూహాన్ని తయారుచేసింది.

 ప్రశ్నిస్తే కేసులుపెడతారా?

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చింది. మరి ఎందుకు అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ప్రవర్తిస్తున్నారు..? వారికి రాజ్యాంగం వర్తించదా? కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారో అన్న భయం ఉంది. ఇది ఒక్కడికే కాదు. మొత్తం రాష్ట్ర ప్రజల్లో ఉండడం బాధాకరం. గట్టిగా మాట్లాడితే ఏ ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తారో, ఏదైనా ప్రశ్నిస్తే ఎక్కడ కేసులు పెడతారో, గట్టిగా విమర్శిస్తే రాత్రికి రాత్రి ఇంకేం చేస్తారని రాష్ట్ర ప్రజలంతా భయపడుతున్నారు.

ఆ తల్లి వేదన బలంగా తాకింది

ఎన్నికల అనంతరం ఇదే కార్యాలయంలో కూర్చున్న నన్ను ఓ తల్లి వచ్చి కలిసింది. స్కూలుకు వెళ్లిన తన 14 ఏళ్ల కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారని, కనీసం ఇప్పటివరకు పట్టించుకున్న వ్యవస్థ లేదని ఆమె చెప్పడం దానికి సంబంధించి అన్ని వివరాలు బయట పెట్టడం నన్ను బలంగా కదిలించింది. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన బిడ్డకు తగిన రక్షణ లేనప్పుడు, మనమేం చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చే ఒక కోపం మాటల్లో చెప్పలేనిది. ఈ వ్యవస్థల పరిస్థితి చూసి నాలో నేను ఎన్నోసార్లు దహించుకుపోయాను. పోరాటమే మార్గంగా భావించాను. సమాజంలో మన దృష్టికి రాని ఇలాంటి ఎన్నో దురాగతాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీని మీద కేసులకు వెరవకుండా పోరాడడం నేర్చుకోవాలి. మనిషికి మనిషి మాత్రమే సహాయం చేయగలడు. మనమంతా కలిసి పోరాడితే మనల్ని అడ్డుకునే వారు ఎవరు ఉండరు. జనసేన నాయకుల్లో పోరాట పటిమ చూస్తే ముచ్చటగా ఉంది. నన్ను నాకు దగ్గరగా ఉన్నవారు నమ్మకపోవచ్చేమో , ఎక్కడో ఉండి నా కోసం ఎంతో నిబద్ధతగా పనిచేసే నన్ను నమ్మే జన సైనికులు, జనసేన కుటుంబం ఉండడం నాకు గొప్ప బలం. అన్యాయం జరిగినపుడు అంతా సంఘటితంగా పోరాడుదాం. మీకు ఎల్లవేళలా తోడుగా నేను ఉంటా. ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం సముపార్జించే జ్ఞానం మనల్ని కుదరుగా ఉండనీయదు. సమాజం కోసం ఏదైనా ఉన్నతమైన పనిచేసే వరకు అది మనల్ని నడిపిస్తుంది.

జనవాణి అంటే అధికార పార్టీకి వణుకు

జనవాణి కార్యక్రమంలో వేల సమస్యలు మన ముందుకు వచ్చాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు బయటకు వచ్చాయి. ఒక దళిత యువకుడుని అరెస్టు చేశారు.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కానీ అతనికి శిరోమండనం చేయించే అధికారం ఈ పాలనా వ్యవస్థకు ఎక్కడిది..? ఓ సైనికుడు దేశానికి కాపలా కాస్తే రాష్ట్రంలో మాత్రం అతడి భూమిని మింగేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు… దివ్యాంగుల సమస్యలు మన దృష్టికి వచ్చాయి. ఎందరో బాధితులు మనల్ని కలిసి వారి వేదనను పంచుకున్నారు. జనవాణి కార్యక్రమం అంటే అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. దీని కోసమే విశాఖపట్నంలో ఆ కార్యక్రమాన్ని కచ్చితంగా అడ్డుకోవాలని చేసిన పన్నాగమే ఈ నెల 15 వ తేదీన చోటు చేసుకొంది. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి నా వాహనం మీదకు వచ్చి పదేపదే రెచ్చగొట్టాలని చూసినా, ఎంతో సహనంతో ఉన్నా. ఒక సమూహం మొత్తం కదులుతున్నప్పుడు భావోద్వేగాలు నిండి ఉంటాయి. ఆ సమయంలో నేను ఏ విధంగా స్పందించినా పెద్ద విషయం అయ్యేది. ప్రభుత్వం అదే కోరుకుంది. కానీ మనం సహనంతో ఉన్నాం.

జైల్ భరో చేద్దాం అనుకున్నాం

అన్యాయంగా కేసుల్లో ఇరికించిన నాయకులు బయటకు రాకుంటే పార్టీ తరఫున జైల్ భరో చేయాలని భావించాం. ఎలాంటి నేరం చేయకున్నా నాయకులను ఇళ్లలోకి వెళ్లి మరీ పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. బస చేసిన నోవాటెల్ హోటల్ లోకి వచ్చి మరీ దౌర్జన్యం చేశారు. న్యాయవ్యవస్థపై పార్టీకి ఉన్న నమ్మకం మనల్ని గెలిపించింది. కచ్చితంగా అక్రమంగా పెట్టిన కేసులు నుంచి కూడా బయటకు వస్తాం. ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన రాష్ట్రంలోని జన సైనికులు అందరికీ అలాగే జైలుకు వెళ్లిన నాయకుల కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు మనో ధైర్యంతో ఉండటం అభినందనీయం” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వం మన అదృష్టం :  నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులు ప్రపంచం మొత్తం చూసింది. పార్టీ నాయకుల అరెస్టు విషయం తెలిసిన దగ్గర నుంచి రాత్రి మొత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిగిన పరిణామాలపై ప్రతిక్షణం వాకబు చేస్తూనే ఉన్నారు. అరెస్టు అయిన వారిని స్టేషన్లు మారుస్తున్నారన్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఎవరు ఏ స్టేషన్ లో ఉన్నారన్న విషయం పార్టీ నాయకుల సాయంతో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అరెస్టు అయిన 9 మందిలో ఒక మహిళ కూడా ఉందని తెలిసి ఆవేదనకు లోనయ్యారు. పార్టీలో ప్రతి ఒక్కరినీ సొంత కుటుంబ సభ్యులుగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు దొరకడం మనందరి అదృష్టం. అరెస్టు అయిన 9 మందిని వీలయినంత త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు ఆయన నిరంతరం న్యాయ నిపుణులతో మాట్లాడారు. పార్టీ న్యాయ విభాగంతో పాటు హైకోర్టు లాయర్లనూ సంప్రదించారు. యుద్ధప్రాతిపదికన బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. అరెస్టు అయిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఎలా ఉంటుందో మాకు తెలుసు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాని, మేము గాని సొంత కుటుంబ సభ్యుల్లానే భావిస్తాం. మీరు కూడా ఏ దశలోనూ కేసులకు భయపడకుండా పార్టీ కోసం ధైర్యంగా నిలబడడం చూసి గర్వంగా అనిపించింద”ని అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *