ap news

రాజకీయ ఉగ్రవాదులు పాలిస్తున్నారు

జనసేన పీఏసీ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

• వైసీపీది ఉత్తరాంధ్ర విధ్వంస రచన
• వైసీపీ వాళ్ళ అహంకారానికి చెప్పు చూపిస్తే తప్పేంటి?
• వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని చూస్తున్నారు
• నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి
• ఈతరం మేల్కోకుంటే రాష్ట్రానికి పెను నష్టం తప్పదు
• ఉత్తరాంధ్రపై అమ్మలాంటి మమకారం నాది!
• ఉత్తరాంధ్రలో జనసేన జెండా ఎగరాలి
• ప్రతికూల సమయంలో భుజం కాసే వారికి తుది శ్వాస వరకు తోడుంటా
• మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖ అక్రమ కేసులు ఎదుర్కొన్న నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు

“వైసీపీ విశాఖపట్నం కేంద్రంగా విధ్వంసం చేయాలని చూస్తోంది. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోంది. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగమే ఈ నెల 15వ తేదీన జరిగిన జనసేనపై ఆంక్షలు… విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రాయోజిత గలాటా. ప్రజా సమస్యలు వినేందుకు జనవాణి కార్యక్రమం కోసం మేం వస్తే, దానిపై మీకున్న భయం ఏంటీ? ఎందుకు? కార్యక్రమాన్ని ఎందుకు జరగనివ్వలేదు..? కార్యక్రమం నిర్వహిస్తామని ఎప్పుడో ప్రకటించినా, దానికి తగిన విధంగా పోలీసులు ఏర్పాట్లు చేసుకోవాల్సింది పోయి తిరిగి మా మీద కేసులు పెట్టడం అంటే కచ్చితంగా ఇదో నాటకం అని అర్ధం అవుతుంది” అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం ఘటనలో అక్రమ కేసులు ఎదుర్కొన్న జన సైనికులు, పార్టీ నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉత్తరాంధ్రలో వైసీపీ వాళ్ళు చేస్తున్నది విధ్వంస రచన. ఉత్తరాంధ్రపై నాకున్న ప్రేమ మాటల్లో వ్యక్తం చేయలేనిది. సిక్కోలు ఉద్యమం నాకు పోరాట అడుగులు నేర్పితే, అక్కడి ఆటపాట నన్ను చైతన్యవంతుడ్ని చేశాయి. ఉత్తరాంధ్ర ప్రజల అంతు లేని ఆరోగ్య సమస్యగా మారిన ఉద్దానం కిడ్నీ భూతంపై ముందడుగు వేసినా, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని గళం ఎత్తినా ఉత్తరాంధ్రపై ఉన్న మమకారమే నన్ను ముందుకు నడిపించింది.
మరి వైసీపీ వాళ్ళకు ఉత్తరాంధ్రపై ఏం అభిమానం ఉంది. అక్కడి ప్రజల బాధలు తెలుసుకొని వారి గొంతుకనయ్యేందుకు వెళ్తే- అడుగడుగునా ఆటంకం కల్గించిన వైసీపీ ప్రయత్నం చూస్తే దీనిలో భారీ కుట్ర ఉందని అర్థమవుతుంది. నాకు కష్టకాలం వేళ అండగా నిలిచిన వారికి, భుజం కాసిన వారిని జీవితాంతం వదలను. తుది శ్వాస వరకు తోడుగా నిలుస్తా. కచ్చితంగా నాయకులకు, జన సైనికులకు అండగా నిలబడతాను. ఎంతటి కష్టం వచ్చినా చేయి వదిలేది లేదు. జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ ఉద్యోగాలు కల్పించడానికి ఉన్నది కాదు. ఇదో పోరాటాల వేదిక. కచ్చితంగా ఇక్కడి నుంచి బలమైన నాయకత్వం రావాలని భావిస్తాను. అధికారం అంటే కొన్ని కులాలు మధ్య, వ్యక్తుల మధ్య ఉండిపోయేది కాదు. దానిని తీసుకునేందుకు కొత్త నాయకత్వం కచ్చితంగా రావాలి.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

చట్టాలను అమలు చేయరు… పాటించరు… గౌరవించరు
భారతదేశ అత్యుత్తమ రాజ్యాంగంపై జనసేనకు అపార గౌరవం ఉంది. చట్టాలపై నమ్మకం ఉంది. కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న అధికార పార్టీకి మాత్రం చట్టం అంటే చులకన భావం. దానిని అందరికీ సమానంగా అమలు చేయరు. వీరు చట్టాలను పాటించరు.. గౌరవించరు. చట్టాలను అపహాస్యం చేసే రాజకీయ ఉగ్రవాదులు రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యం.
రక్షించాల్సిన వ్యవస్థలే భక్షిస్తుంటే సామాన్యుడు ఎలా బతకగలుగుతాడు. నేరమయ రాజకీయాలు చేస్తున్న నాయకులకు ఐపీఎస్ అధికారులు సెల్యూట్ చేయడం మన రాష్ట్రంలోనే ఉంది. అధికారం ఉంది కాబట్టి ఏం చేస్తామన్నా చెల్లదు. సమాజంలో కాస్త గుర్తింపు ఉన్నవారినే ఈ ప్రభుత్వం ఇష్టానుసారం ఇబ్బందిపెడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. దానిని దెబ్బతీస్తే బ్రతకడం కూడా కష్టం అవుతుంది. భూమి తల్లికి ఎలా నమస్కరిస్తామో సాటి మనిషికి అలాగే నమస్కరిస్తాం. అయితే ఎదుట వారు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు… ప్రతిస్పందిస్తారు అన్నదే కీలకం. రాష్ట్రంలో అలాంటి ప్రతి నమస్కారం చేసే సంస్కృతి కూడా లేదు.

మీది మాత్రమే భావ స్వేచ్ఛ.. మాది కాదా?
మీరు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం చెప్పినప్పుడు మీకు ఉన్న భావ స్వేచ్ఛ మాకు ఎందుకు ఉండదు. అధికార పార్టీకే భావ స్వేచ్ఛ ఉంటుంది అని రాజ్యాంగం లో ఎక్కడైనా ఉందా? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందరికీ సమానంగా.. దాని గొప్ప ఫలాలు అందాలి. రాజ్యాంగంలోని బాధ్యతలు, హక్కులు అందరికి సమానంగా వర్తిస్తాయి. మీకేమి కొత్తగా కొమ్ములు పుట్టుకు రాలేదు. మీకేమి కొత్తగా రాజ్యాంగం లేదు. మీకు ప్రత్యేక చట్టాలు ఏమి లేవు. మీరు తప్పులు చేస్తే చట్టాలు ఉండవు కానీ, పేదలపై వేధింపులకు మాత్రం చట్టాలు వాడతారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తారు.
వైసీపీ తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలి
అన్ని వ్యవస్థలను నాశనం చేసే పాలకులకు, పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలి. ఇంట్లోని ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తాం అని అంటున్న వారికి పాలకులు గులాం కొడుతుంటే తిరగబడక ఇంకేం చేస్తాం..? ఒక సామాన్యుడి గుండె ఎంత మండిపోతుందో ఆలోచించండి. మేము రాష్ట్రంలో ఎక్కడికి రావాలో.. ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మీరే నిర్దేశిస్తే ప్రజాస్వామ్యం ఉన్నది ఎందుకు..? రాజ్యాంగం మనకు సాధికారత ఇచ్చింది. దానిని ఎప్పుడు అతిక్రమించొద్దు. మీరు ఎన్ని చేసినా సహిస్తాం.. భరిస్తాం… చివరకు మాత్రం యుద్ధం చేసి గెలుస్తాం.
ప్రతికూల పరిస్థితుల్లోనే నాయకత్వ లక్షణాలు
విశాఖపట్నం పర్యటనకు ఐదు రోజుల ముందే కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి విశాఖలో ప్రభుత్వం చేయబోయే విధ్వంసం గురించి కొంత సమాచారం వచ్చింది. అయితే వాటికి భయపడి ఇంట్లో ఉండిపోతే ఎప్పుడు ముందుకు కదలగలం..? అందుకే తెగింపుతో విశాఖలో అడుగుపెట్టాం. అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రభుత్వం చేయబోయే ధ్వంస రచన అర్థమైంది. చాలా సహనంతో ఉన్నాం. పోలీసులు చేసిన అదిలింపులకు వెరవలేదు. అయితే అర్ధరాత్రి బస చేసిన హోటల్లో పోలీసులు పూర్తిస్థాయిలో చేసిన నాటకీయ పరిణామాలు నాకు ఆవేదన నింపాయి. అరెస్టుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వారికి అండగా నిలబడాలని నిర్ణయించాం.
నాయకత్వం అంటే తెల్ల చొక్కా వేసుకొని, సరదాగా ముగ్గురిని వెనక పెట్టుకుని తిరిగేది కాదు. నాయకత్వం అంటే అదో పెద్ద బాధ్యత. ప్రతికూల పరిస్థితుల నుంచే గొప్ప నాయకులు పుడతారు. కొత్త తరం నాయకత్వం ప్రజా సమస్యల నుంచి పోరాటాల నుంచి పుట్టాలి అన్నది నా అభిలాష. దానికి తగినట్లుగానే రాటు తేలదాం. విశాఖ అక్రమ అరెస్టులు మనలో మరింత సమన్వయాన్ని, సంఘటిత భావనను పెంచాయి. ఇదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర ప్రజా సమస్యల మీద పోరాడే నూతన నాయకత్వం రావాలని కోరుకుంటాను.

నాకేంటి నుంచి మాకేంటిలోకి రండి
రాష్ట్రంలో వ్యక్తులంతా విడివిడిగా విడిపోయారు. నా నేల, నా భూమి, నా సంస్కృతి, నా రాష్ట్రం అనే భావన లేదు. కేవలం నా కులం.. నాకేంటి అన్న వ్యక్తిగత స్వార్ధ భావన నుంచి మనం బయటకు రావాలి. ఈతరం దీనిపై కళ్ళు తెరవకపోతే రాష్ట్రాన్ని రక్షించడం దాదాపు అసాధ్యం. కచ్చితంగా నేటి తరంలో దీనిపై బలమైన ఆలోచన రేకెత్తించేలా జనసేన పోరాటాలు ముందుకు వెళ్లాలి. జరుగుతున్న అన్యాయం, భవిష్యత్తు తరాల దోపిడీని అర్థం చేసుకొని పాలకులను ప్రశ్నించాల్సిన సమయం ఇది. కచ్చితంగా దీనికి సమాయత్తమవుదాం. నాయకుడికి ప్రజల అవసరం ఎంత ఉందో ప్రజలకు కూడా మంచి నాయకత్వం అవసరం అంతే ఉంది. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్దాం. 2019లో ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం ఎంత నాశనం అయిందో కళ్లారా చూస్తున్నాం.

సంఘటితంగా ఎదుర్కొందాం
న్యాయపరమైన అంశాల పట్ల జనసేన పార్టీ నాయకులు శ్రేణులు కచ్చితంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. వ్యవస్థల్లో బలమైన మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఈ ప్రయాణంలో ఎందరో నాకు అండగా నిలిచారు. విశాఖ ఘటనతో మనం ఎంత సంఘటితంగా ఉన్నామో బలమైన పోరాటాలు ఎలా చేయగలమో అర్ధం అయ్యింది. ఈ పాలకుల తీరు చూస్తే… ఈ రాష్ట్రానికి ఏమైనా చేయండి అని అడిగేలా లేదు.. మీరు ఏమీ చేయకపోతే చాలు అన్నట్లుగా ఉంది. కచ్చితంగా ప్రజా పోరాటాలను నిర్మించుకుందాం. ఈ ప్రభుత్వ దురాగతాల మీద సంఘటితంగా పోరాడుదాం. స్థానికంగా ఉండే ప్రతి సమస్యను గుర్తించండి. పార్టీకి మద్దతుదారులను కూడగట్టండి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా పని చేద్దాం. ప్రజాస్వామ్యానికి గొప్ప శక్తి ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని మనం నిత్యం వణికిస్తున్నామంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనమే. లక్ష మంది బాధితుల్లో మొదట గొంతు ఎత్తేది ఒక్కడే. అక్కడి నుంచే మిగిలినవారు అన్యాయంపై గొంతు ఎత్తుతారు. ఇంట్లో కూర్చుని అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అంటే కుదరదు. మొదట నువ్వు గొంతెత్తాలి. మార్పు నీ నుంచే మొదలు కావాలి. ఈ తరం

మేల్కొకపోతే రాష్టంలో నేరం చట్టబద్ధం అయిపోతుంది.
ప్రజా సమస్యలను కనీసం అర్థం చేసుకోకుండా, కేవలం ఎన్నికల కోసం వచ్చేవారి కోసం జనసేన పార్టీ లేదు. పార్టీ ప్రయాణంలో ఇప్పటికే బలమైన నాయకుల్ని, కొత్త తరాన్ని సమీకరించగలిగాం. ప్రజా పోరాటాలను బలంగా చేసి ప్రజల వైపు నిలబడేలా సమర్ధ నాయకులు జనసేనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సిద్ధాంతాలను, పార్టీ భావజాలాన్ని బలంగా ఓటర్లలోకి తీసుకువెళ్లాలి. నేరమయ రాజకీయాలనుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.

జనసేన ముఖ్య కార్యకర్తలతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తాం

కొందరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల వేదన బాధ కలిగిస్తోంది. జనసేన అధికారంలోకి రాగానే సీపీఎస్ ను రద్దు చేసే బాధ్యతను తీసుకుంటాం. సుగాలీ ప్రీతి కేసును తొలుత చేపడతాం. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాం. గందరగోళంగా ఉన్న వ్యవస్థలను చక్కదిద్దుతాం. రాజ్యాంగంలో చెప్పినట్లు అందరికీ సమన్యాయం జరిగేలా పాలన ఉంటుంది. పేదలకైన పెద్దలకైనా ఒకే తరహా న్యాయం అమలు జరిగేలా చూస్తాం. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్రాన్ని పరిపాలిస్తాం. రాష్ట్ర ప్రజలందరి శ్రేయస్సు దృష్ట్యా జనసేన పార్టీ విధానాలు, నిర్ణయాలు ఉంటాయి. పార్టీ మేనిఫెస్టో లో కూడా అదే ఉంటుంది. కచ్చితంగా 2024 లో జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం ” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *