ap news

నకిలీ చిట్ ఫండ్ లు.. జాగ్రత్త..

నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు,

డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలపై

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు

నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు,ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ ల మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలనీ, అలాంటి మోసాలపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్.రావత్ అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 23వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకూ ఆన్లైన్ మోసాలు,నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు అధికం అవుతున్నాయని అలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీలు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రజల్లో ఈవిధమైన మోసాలపై పెద్దఎత్తున అవగాహన పెంపొందించాల్సి ఉందని పేర్కొన్నారు.అనేక రకాల కొత్త యాప్ లు పుట్టుకొచ్చి ఆర్ధికపరమైన మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసగించడం జరుగుతోందని అన్నారు.కావున ప్రజలు నకిలీ యాప్ లు,ఆన్లైన్ మోసాలు,నకిలీ చిట్ ఫండ్ కంపెనీల ఉచ్చులో పడి పెట్టుబడి పెట్టి మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి రావత్ సూచించారు.బిట్ కాయిన్,క్రిప్టో కరెన్సీ పేరిట పెద్దఎత్తున ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని అలాంటి మోసాల పట్ల ప్రజలు ఆకర్షితులై మోసపోకుండా జాగత్త తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.ఈవిధమైన ఆన్లైన్ మోసాలు,నకిలీ కంపెనీలు,చిట్ ఫండ్ కంపెనీలు వంటి వాటి కార్యకలాపాలను నియంత్రించేందుకు వివిధ కేంద్ర రాష్ట్ర రెగ్యులేటరీ అధారిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.అంతేగాక అలాంటి మోసాలకు పాల్పడిన వారిపై సకాలంలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి రావత్ చెప్పారు.

ఆర్బీఐ, రాష్ట్ర ఆర్ధికశాఖ అధికారుల సంయుక్త సమావేశం

ఈసమావేశానికి రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాల రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల స్వాగతం పలికారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ఆర్ధిక పరమైన మోసాలు,డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలు,నకిలీ కంపెనీల మోసాలపై చర్చించి నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత బాడీ ఎస్ఎల్సిసి అని పేర్కొన్నారు.ఈ ఎస్ఎల్సిసి సమావేశాలు ప్రతి మూడు మాసాలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.వచ్చే క్వార్టర్ సమావేశాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించేలా చూడాలని సూచించారు.
ఈసమావేశంలో రిజర్యు బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వై.జయకుమార్ అజెండా అంశాలను వివరాలను సమావేశంలో చర్చకు పెట్టారు.తొలుత గత 22వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశపు మినిట్స్ ను ఆమోదించడం జరిగింది.తదుపరి అజెండా అంశాలైన వివిధ చిట్ ఫండ్ కంపెనీలు అగ్రిగోల్డ్,అక్షయ గోల్డు,హీరా గ్రూప్ తదితర మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు.అలాగే మార్కెట్ ఇంటిలిజెన్స్ కు సంబంధించి వివిధ లోన్ యాప్ ల ద్వారా వేధింపుల ఫిర్యాదులు,ముద్రా అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ,వర్థన్ బ్యాంకు స్కాం తదితర సంస్థలపై మోసాలు ఇప్పటి వరకూ నమోదైన కేసుల ప్రగతి తదితర అంశాలను సమావేశంలో సమీక్షించారు.అదే విధంగా బానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్(బడ్స్)చట్టం 2019పై సమీక్షించారు.
ఈసమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,న్యాయశాఖ కార్యదర్శి సునీత,రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ బాబు ఏ,సిఐడి డిఐజి సునీల్ కుమార్ నాయక్,ఎస్ఎఫ్ఐఓ అదనపు సంచాలకులు ప్రసాద్, ఐఅండ్పీఆర్ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత, ఆర్బిఐ ఎజియంలు,సెబి,ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *