ap news

రాజ్యాంగ హక్కులపై సర్పంచ్ లు పోరాడాలి

సర్పంచ్ ల సదస్సులో  చంద్రబాబు నాయుడు

వివేకా హత్యలో నాడు నాపై నేరం మోపిన జగన్ ఇప్పుడు సమాధానం చెప్పాలి.

దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి పైనే కేసు పెట్టడం దేశంలోనే జరగలేదు

జగన్ వైఫల్యంతో పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ గా మార్చేశారు

టిటిడి నిర్ణయాలతో తిరుమల శ్రీవారి ని భక్తులకు దూరం చేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి డబ్బు, అధికారం, ఒత్తిళ్లు వంటి సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల్లో పోరాడి గెలిచిన మీరే నిజమైన హీరోలు అంటూ చంద్రబాబు సర్పంచ్ లను ప్రశంసించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. రాజ్యాంగం సర్పంచ్ లకు ఇచ్చిన హక్కులపై పోరాటం చెయ్యాలని పిలుపు నిచ్చారు. దేశంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు…గ్రామంలో సర్పంచ్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని ప్రశ్నించారు. చెత్తపన్ను వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలి అని చంద్రబాబు సూచించారు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.. నా పంచాయతీ నా ఇష్టం అని సర్పంచులూ చెప్పాలి అని వివరించారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులు, నరేగా నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని…దీనిపై పోరాటం చెయ్యాలని చంద్రబాబు సర్పంచ్ లకు సూచించారు. నరేగా పనుల్లో 6 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. వీటిపై పోరాడాలని….పోలీసు కేసులకు భయపడకండి…అవసరం అయితే తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ప్రైవేట్ కేసులు వేద్దాం అని దైర్యం చెప్పారు.

సదస్సులో పాల్గొన్న టిడిపి తరపున గెలిచిన సర్పంచులు

వివేకా హత్యపై జగన్ నోరు విప్పాలి

సర్పంచుల సదస్సులో చంద్రబాబునాయుడు

ఒక వ్యక్తి ఎంతగా అబద్ధాలు చెప్పొచ్చు అనేది జగన్ చూస్తే అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య లో జగన్ ఎప్పుడు ఏమి చెప్పాడో చూస్తే జగన్ వైఖరి పూర్తిగా అర్ధం అవుతుందని అన్నారు. నేను వివేకా హత్య చేయించాను అని నాకు రక్తం మరక అంటించే ప్రయత్నం చేశారు…..ఇప్పుడు సిబిఐ విచారణ లో నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. జగన్ సోదరి…జగనన్న బాణం షర్మిల ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అంటూ ప్రశ్నించారు. జగన్ మరో సోదరి సునీత తన తండ్రి హత్యపై ఎలా ఫైట్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పే ప్రయత్నం చేశారని….హత్య కేసు పెట్టవద్దని ఏకం గా CI శంకరయ్య ను బెదిరించిన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. వివేకా శవానికి కుట్లు వేసి….గాయాలు కనపడకుండా పూలు పెడతారా?…మనుషులు ఈ పనులు చేయగలరా….అని చంద్రబాబు అన్నారు. దర్యాప్తు చేస్తున్న CBI అధికారులపైనే కేసు కేసు పెట్టడం దేశం లో ఎక్కడైనా ఉందా అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సిఎం స్థానం లో ఉన్న జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలను, అబద్ధాలను సమర్థవంతంగా చెప్పి జగన్ రాజకీయ లబ్ధి పొందారని..మనం ప్రతి అంశం పై నిజాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సర్పంచ్ లను కోరారు.

శ్రీవారిని భక్తులకు దూరం చేస్తున్న టిటిడి

టిటిడి తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే టీటీడీ సభ్యులు టిక్కెట్ ధరలపై వేలం పాట పెడతారా? అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని కరోనా ఆంక్షలు తిరుమల లోనే ఉన్నాయి… వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ ను తగ్గించాలని చుస్తే దెబ్బతింటారు అని హెచ్చరించారు.

అధైర్య పడలేదు…బాధతో స్పందించాను

అసెంబ్లీ 5 కోట్ల మంది ఆశలను ప్రతిబింబించాలని చంద్రబాబు అన్నారు. గత అసెంబ్లీ లో జరిగిన ఘటనకు నేను అదైర్య పడలేదు…నిర్వీర్యం అవ్వలేదు అని వివరించారు. కానీ భార్య పై దారుణ వ్యాఖ్యలు చేస్తే ఒక మనిషిగా ఆ సందర్భం లో అలా స్పందించాను అని వివరించారు. మీరు దైర్యంగా ఉండాలి అంటూ ఓ కార్యకర్త చెప్పిన మాటకు సమాధానంగా చంద్రబాబు నాటి ఘటనపై స్పందించారు. రావణాసురుడి లాంటి దుష్ట పరిపాలన వచ్చినప్పుడు ఇలాంటి కష్టాలు వస్తాయి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు….వేధిస్తున్నారు అని అన్నారు. వైసీపీ వాళ్ళు బూతులు తిడితే మనం తిరిగి తిట్టల్సిన పని లేదు…సమాధానం చెపితే చాలు అని నేతలకు తెలిపారు. జగన్ నాడు ఓదార్పు అని ఏళ్ల తరబడి తిరిగాడు…ఇప్పుడు బాధితులను తన వద్దకు పిలిపించుకుంటున్నాడు అని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగులను PRC విషయం లో ఎలా మోసం చేశాడో మనం అంతా చూశాం….జగన్ వచ్చాక ఒక్క DSC అయినా పెట్టరా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్ ను బ్యారేజ్ చేశారు

జగన్ ప్రభుత్వం తన వైఫల్యంతో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చెయ్యలేకపోతుందని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలో 71 శాతం పనులు పూర్తి చేశామని….2020 జూన్ కే నీళ్లు ఇచ్చే వాళ్లమని అన్నారు. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్ల కు తగ్గిస్తున్నారని…దీని వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తెస్తాం అని నాడు జగన్ అసెంబ్లీ లో చెప్పి…ఇప్పుడు చేతులు ఎత్తేశారని గుర్తు చేశారు. ఇలా ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలం అయ్యిందని…దీనిపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యం చెయ్యాలని సర్పంచ్ లను చంద్రబాబు కోరారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *