మోడీ సర్..అల్లూరిని విస్మరించవద్దు
అభివృద్ధి చిహ్నానికి అల్లూరి పేరు పెట్టాలి
పడాల వీరభద్రరావు విజ్ఞప్తి
తెలుగుజాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పిన ‘విప్లవ జ్యోతి’ అల్లూరి సీతారామరాజును విస్మరించడం తగదని ఈనెల 11వ తేదీన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖపట్నం విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఒక ప్రకటన ద్వారా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ ముష్కరులపై మూడేళ్లు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించిన అల్లూరి ఉమ్మడి విశాఖ జిల్లాలో జన్మించి, నడయాడి, పోరాటం సాగించి, వీరణం పొందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గత జూలై 4న 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించి, ఆ మహనీయుని స్మరించుకొని ఘన నివాళులు అర్పించి అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని విడుదల, పార్లమెంట్ లో అనుమతులు ఉన్న అల్లూరి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేస్తారని ఆశించడం జరిగిందని పడాల తెలిపారు. అలాగే పలువురు స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నాలుగా పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం వారి పేర్లు పెట్టడం జరుగుతుందని, స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్ చంద్రబోస్ పేరున 125 రూపే నాణాన్ని విడుదల చేశారని, భగత్ సింగ్ పేరును ఒక విమానాశ్రయానికి పేరు పెట్టడం జరిగిందని అటువంటిది తెలుగుజాతి ముద్దుబిడ్డ అల్లూరిని నిర్లక్ష్యం చేసి ఎందుకు వివక్షతకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి, ఏదో ఒక అభివృద్ధి చిహ్నానికి అల్లూరి పేరు పెట్టాలని వీటిపై బహిరంగ సభలో ప్రకటించాలని పడాల వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.