ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నూరు శాతం ఉచిత వైద్యం అందాలి
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులలో పేదలకు నూటికి నూరుశాతం ఉచిత వైద్యం అందాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు బుధవారం ఆరోగ్య మిత్రలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగంలో పేద కుటుంబాలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్య మిత్రలదే కీలక పాత్ర అని వెల్లడించారు. కనుక ఆరోగ్య మిత్రలు విధులలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏదేనీ ఆరోగ్య సమస్యతో నెట్ వర్క్ ఆస్పత్రులకు వచ్చే పేషంట్లకు సరైన సమాచారం అందజేయాలన్నారు. కొత్తగా చేర్చిన 809 వైద్య చికిత్సలతో కలిపి 3,225 ప్రొసిజర్లపై రోగులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా హృద్రోగులు, బ్రెయిన్ స్ట్రోక్ పేషంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఒకవేళ రోగికి ఆరోగ్యశ్రీ కార్డు లేనిపక్షంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ తో మాట్లాడి అరగంటలో CMCO లేఖ వచ్చేలా చొరవ చూపాలన్నారు. విధులలో ఎక్కడా అలసత్వం, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని తెలిపారు. సర్జరీ అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సలహాలు, సూచనలు తెలియజేయాలన్నారు. డిశ్చార్జ్ సమయంలో మందులు ఇస్తున్నదీ లేనిదీ పరిశీలించడంతో పాటు ముఖ్యమంత్రి సందేశాన్ని తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.