విజయవాడలో దళిత స్త్రీ శక్తి సదస్సు
దళిత ఆదివాసీ మహిళల సమస్యలపై దిశా నిర్దేశం
వార్షిక నివేదికను ఆవిష్కరణ
దళిత స్త్రీ శక్తి (డీఎస్ ఎస్) తన ప్రయాణంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్లోని అంబేద్కర్ భవన్లో గురువారం 18వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “దళిత, ఆదివాసీ మహిళలు – సామాజిక న్యాయం” అనే అంశంపై డీఎస్ ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఆర్ ఎస్ (రిటైర్డ్) అధికారి రాజేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి సరళ వందనం, సైకాలజిస్ట్ రమాదేవి, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షురాలు శివాని, ఎస్టీ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు. దళిత, ఆదివాసీ మహిళలకు సాధికారత కల్పించడంలో సుదీర్ఘకాలంగా డిఎస్ఎస్ లో నిబద్దతతో కలిసి ప్రయాణం చేస్తున్న వారు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వక్తలు సామాజిక న్యాయం, రాజ్యాంగ నిబంధనలు, సమానత్వం, సామాజిక న్యాయం సాధించడానికి అనురించాల్సిన మార్గాలపై సభకు హాజరైన వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రచురించిన డీఎస్ ఎస్ 18వ వార్షిక నివేదికను గంధం చంద్రుడు ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు సదస్సుకు హాజరయ్యారు. డీఎస్ ఎస్ నేషనల్ కో ఆర్డినేటర్ సత్య, రాష్ట్ర సమన్వయకర్తలు రోహిణి, స్వప్న, రోజా, మేరీ నిర్మల, కుమారి తదితరులు పాల్గొన్నారు.
