ఏపీని బాబు తగలబెడుతున్నారు
బెంగళూరులో జగన్ ఫిడేలు వాయిస్తున్నారు
ధ్వజమెత్తిన బీసీవై అధినేత బోడె రామచంద్రయాదవ్
స్థానిక ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు..
వైఎస్సార్సీపీ ‘వెర్షన్ 2.0’ను తలపిస్తున్న వైనం
మైదుకూరులో ఒక న్యాయం.. కనిగిరిలో మరో న్యాయమా..
అమరావతి, ఆంధ్రావని : లా అండ్ ఆర్డర్ విషయంలో తనను మించిన వారు లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని తగలబెడుతుంటే.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుగా బెంగళూరుకు వెళ్లిపోయారని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్రంగా విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ రాష్ట్రంలో కంటే కర్ణాటకలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, ఆయన వల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రాబందుల్లా వచ్చే ఈ రెండు పార్టీల నేతలు, ఆ తర్వాత పక్క రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరుల్లో సేదతీరుతున్నారని మండిపడ్డారు.
మైదుకూరులో ఒక న్యాయం..కనిగిరిలో మరో న్యాయమా..
కడప జిల్లా మైదుకూరులో నామినేషన్ చించేశారని చెప్పి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల సంఘం.. ప్రకాశం జిల్లా కనిగిరిలో బీసీవై పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ను బహిరంగంగా చించేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం, మార్కాపురం కలెక్టర్ నుంచి నివేదిక వెళ్లినప్పటికీ కనిగిరిలో ఎన్నికలను రద్దు చేసి రీ-నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రాంతానికో న్యాయం, పార్టీకో నిబంధన అన్నట్లుగా ఎస్ఈసీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అభ్యర్థుల నామినేషన్లను దౌర్జన్యంగా చించేస్తున్నా, చంద్రబాబుకు కోపం వస్తుందనే భయంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉండటం హాస్యాస్పదమన్నారు. దౌర్జన్యంగా నామినేషన్లు చించేసిన ప్రతి చోటా వెంటనే ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ సజావుగా ఎన్నికలు నిర్వహించేలా రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

