బంగారం దొంగల ముఠా అరెస్ట్
- రూ 5.84 కోట్ల విలువైన బంగారు బిస్కట్లు స్వాధీనం
- విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తూ ఇక్కడ విక్రయం
- బంగారంతో పాటు విదేశీ కరెన్సీ స్వాధీనం
- సమన్వయంతో పనిచేసిన హైదరబాద్, విజయవాడ పోలీసులు
విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో బంగారం తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంగారమే కాకుండా విదేశీ కరెన్సీని కూడా ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. వారి వద్ద నుంచి 3,147.1 గ్రాముల బంగారం, 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరో కరెన్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ 5.84 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో మొత్తం అయిదురుగిరిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి విదేశీ మూలానికి చెందిన బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి, కోల్కతా మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న ముఠాకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం పోలీస్ నిఘా వర్గాలకు అందింది. ఈ నేపత్యంలో నిఘా సమాచారం అందింది. ఈ సమాచారంపై హైదరాబాద్ జోనల్ యూనిట్, విజయవాడ ప్రాంతీయ యూనిట్ అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ శివార్లలో ఒక స్కార్పియో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా, వాహనంలోని రహస్య అరలో విదేశీ కరెన్సీ లభించింది. వారిని విచారించగా ఆ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు విజయవాడ శివార్లలో బంగారాన్ని అప్పగించినట్లు అంగీకరించారు. వాహనంలో లభించిన విదేశీ కరెన్సీ అక్రమంగా రవాణా చేసిన బంగారం విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములో భాగమని వెల్లడించారు. దీంతో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి, బంగారాన్ని తరలిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. వారు ప్రజా రవాణా బస్సులో హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా, ఒక టోల్ ప్లాజా వద్ద అడ్డగించి తనిఖీ చేశారు. వారి వద్ద సుమారు 3.1 కిలోల బరువున్న మూడు విదేశీ మూలానికి చెందిన బంగారు బిస్కెట్లు లభించాయి. వాటిని ఒక చిన్న సంచిలో ఉంచి, నడుముకు కట్టుకుని తరలిస్తున్నట్లు గుర్తించారు.ఈ అక్రమ రవాణా సొత్తును సేకరించడం, రవాణా చేయడంలో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురిని అధికారులు అరెస్టు చేసి, సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.



