హస్తకళల ప్రదర్శనకు విశేష స్పందన

 

  • దేశవ్యాప్తంగా సంప్రదాయ కళారూపాలు, చేనేత ఉత్పత్తులకు ఆదరణ
  • కళాకారులకు మార్కెటింగ్ వేదికగా లేపాక్షి గాంధీ శిల్ప బజార్

విజయవాడ: సంప్రదాయ హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడంతో పాటు కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్‌కు విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందించిన విభిన్న హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన సంప్రదాయ కళలు, చేనేత ఉత్పత్తుల విక్రయాలకు విలువైన వేదికగా నిలుస్తోంది.

విజయవాడ ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలో పంటకాలవ రోడ్డు మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన 18వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది హస్తకళాకారులు, చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ కళారూపాలు, చెక్క శిల్పాలు, టెర్రకోట ఉత్పత్తులు, తోలుబొమ్మలు, క్రోషియా లేస్, ఇమిటేషన్ ఆభరణాలు, వెంకటగిరి చీరలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ లక్క బంగిళ్లు, పోచంపల్లి ఇకత్ చీరలు, కర్ణాటక చన్నపట్నం బొమ్మలు, కొల్హాపురి చెప్పులు, ఉత్తరప్రదేశ్ జరీ, చికన్‌కారీ వస్త్రాలు, అస్సాం వెదురు, కేన్ ఉత్పత్తులు సహా పలు ప్రాంతాల ప్రత్యేక కళాకృతులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.

కళాకారులు తమ చేతులతో రూపొందించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం ఈ ప్రదర్శన ద్వారా లభిస్తోంది. దీనివల్ల వారి ఉత్పత్తులకు మార్కెట్ విస్తరించడంతో పాటు ఆదాయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. మరోవైపు, వినియోగదారులు వివిధ ప్రాంతాల సంప్రదాయ కళలు, చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై వీక్షించి కొనుగోలు చేయగలుగుతున్నారు. హస్తకళాకారులకు శిక్షణ, డిజైన్ అభివృద్ధి, ఆధునిక పనిముట్ల పంపిణీతో పాటు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు లేపాక్షి ప్రాధాన్యం ఇస్తోంది.

ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ – లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. సంప్రదాయ హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కళాకారులు తమ నైపుణ్యంతో రూపొందించిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చన్నారు. భారతీయ సంప్రదాయ కళా వైభవాన్ని భావితరాలకు అందించడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు లేపాక్షి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి హస్తకళలు, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులకు ప్రోత్సాహం అందించాలని హరి ప్రసాద్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *