దసరా ఉత్సవాల్లో వైద్య సేవలు

దుర్గమ్మ ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు 

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో వైద్యారోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది 16 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, 49 మంది వైద్యాధికారులు, 30 మంది ప్రత్యేక వైద్యులు, 431 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించింది. అత్యవసర సేవల కోసం 9 అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. వైద్య సేవల పర్యవేక్షణ కోసం 19 సెక్టార్లను ఏర్పాటు చేసి, ఆరుగురు కార్యక్రమ అధికారులను నియమించింది. కార్యక్రమ సమన్వయ అధికారి పోస్టును కూడా కొత్తగా ఏర్పాటు చేసింది. అక్టోబరు 21 వరకు దసరా ఉత్సవాల వైద్య సేవలు కొనసాగుతాయి. ఈ వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు.

పెరిగిన వైద్య సేవలు

దసరా ఉత్సవాల మొదటి నాలుగు రోజుల్లో ఈ ఏడాది 31,228 మంది వైద్య సేవలు పొందారు. ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ. శ్రవణబాబు, సీనియర్‌ అధికారి డాక్టర్‌ జె. ఇందుమతి దేవీరావు క్షేత్రస్థాయిలో భక్తులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సరస్‌ మేళాలోనూ ప్రత్యేక వైద్య సేవలు

సరస్‌ మేళా సందర్భంగా అక్టోబరు 31 వరకు ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు వైద్య శిబిరాల ద్వారా సేవలు అందిస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఐదు పడకల చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రథమ రిఫరల్‌ వైద్యశాలగా భవానీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుర్తించారు. విజయవాడ ఉత్సవాల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని, ఉన్నత స్థాయి వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక రిఫరల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల కోసం 15 మంది వైద్యాధికారులు, ఐదుగురు ప్రత్యేక వైద్యులు, 85 మంది పారామెడికల్‌ సిబ్బందిని నియమించారు. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్సులను నాలుగు ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ ఆర్‌. వెంకటరమణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *