Prakasam

టిడిపిలో కోవర్టు గోల

అదంతా కుట్ర..

కార్యకర్త పేరుతో హల్ చల్ చేస్తున్న లేఖ 

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కోవర్డు గోల కొనసాగుతూనే ఉంది. పార్టీలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న మహిళా నాయకురాలు వైసీపీకీ..,ప్రత్యేకించి ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)కి ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేసే గూఢచారిగా వ్యవహరిస్తూ కోవర్టుగా మారారని ఆరోపిస్తూ..తాజాగా విద్యుత్ శాఖలో ఒక అధికారిని బదిలీ చేసేందుకు బేరం కుదుర్చుకుని లక్షలు గడించారని ఉటంకిస్తూ మీడియా కోడై కూయటంతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. ఈ పరిణామం ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కటంతో నారా లోకేష్ సైతం పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కొందరు పార్టీ నేతలకు పని పురమాయించారు. ఒకటి కాదు..రెండు కాదు.. వరుసగా అన్ని మీడియాల్లో కోవర్టు కథ సీరియల్ గా వస్తుండటంతో టీడీపీలోని ఆ మహిళలకు మద్దతుగా కొందరు మహిళా నేతలు ఎట్టకేలకే బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు..ఇదంతా కుట్రగా అబివర్ణించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రావుల పద్మజ దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ కార్యకర్త పేరుతో తాజాగా విడుదలైన లేఖ ఇపుడు హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం కోవర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నేతకు మద్దతుగా..ఒంగోలు మున్సిపాల్టీలో గతంలో కీలక పదవి నిర్వహించి అందరికీ సుపరిచితుడైన ఒక నేతను టార్గెట్ చేసుకుని విడుదలైన లేఖ యధాతధంగా..

జై తెలుగుదేశం..జై జై తెలుగుదేశం..
కష్టపడి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరాయంగా శ్రమిస్తున్న నాయకులపై తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ
“పెయిడ్ వార్తలతో” బురద జల్లుతూ పార్టీ గోడలకు బీటలు వారుస్తున్న “నిజమైన కోవర్టులను” తరిమి, తరిమి కొట్టండి! రాబోవు ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బాబు గారికి బహుకరించడానికి సన్నద్ధులు కండి!!

ప్రియమైన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మనవి…
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బలహీన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి దాపురించగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుగారు తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం అంటూ జరిగితే ముఖ్యమంత్రి గానే అడుగుపెడతానని శపథం చేసిన విషయం మనందరికీ తెలుసు..
ఈ పరిస్థితిలో బలమైన ప్రత్యర్థితో యుద్ధం చేయాల్సిన సమయంలో వైరి పక్షాన్ని ఓడించడానికి కావాల్సిన సంపత్తిని తయారు చేసుకోవలసిన స్థితిలో దాన్ని వదిలేసి వ్యక్తిగతంగా తమకు పార్టీలో నచ్చని సొంత పార్టీ నాయకులపై కుట్రలు, కుతంత్రాలు, దాడులు చేయించే విష సంస్కృతి మన ఒంగోలు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీలో ఇప్పుడు చూస్తున్నాం..
అందులో భాగంగా నిజాయితీగా, నిబద్ధతగా, ఎల్లవేళలా చురుకుగా పార్టీ వ్యవహారాలలో ముందుండి కార్యక్రమాలను నడిపించే ఓ మహిళా నేతపై… మన పార్టీలోనే ఉంటూ నియోజకవర్గ ముఖ్య నాయకుడికి పక్కనే ఉండి శల్యసారధ్యం వహిస్తున్న క్రీస్తుపూర్వం ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన పార్టీలో ఏ బాధ్యత లేని ఓ నాయకుడు తనకు ఆ మహిళా నేత వ్యాపారపరంగా పోటీదారుగా భావించి ఆమెకు అపకీర్తిని కల్పించి తన వ్యాపార పోటీదారుగా ఆమెను తప్పించడానికి ఒక ప్రముఖ పత్రికలో పెయిడ్ వార్త ను దిక్కు- మొక్కు (వివరాలు) లేకుండా కోవర్టు అనే ప్రచారంతో రాపించగా దాన్ని ఆధారం చేసుకొని మరికొంతమంది సదరు మహిళా నేత అంటే పడని మహిళా నాయకురాళ్లు దానినే సాగదీస్తూ…. పెయిడ్ వార్తల పరంపరను కొనసాగించారు.
మా లాంటి పార్టీ శ్రేయోభిలాషులకు వచ్చిన అనుమానం ఏమిటంటే ఒక పత్రికలో వచ్చిన తప్పుడు కథనం మరో పత్రికకో లేదా టీవీ న్యూస్ కో ఆధారం ఎలా అవుతుంది??? అని..మొత్తం ఈ ప్రహసనంలో ఎవరి దగ్గర కూడా ఒక్క ఆధారం లేకపోగా ఆ మహిళా నేతపై కసిగా బురదజల్లే కార్యక్రమం మాత్రమే కనిపిస్తుంది.. దీన్నిబట్టి ఈ మహిళా నేతపై ఎంతగా కక్షసాధింపు జరిగిందో తేటతెల్లంగా అర్థమవుతుంది ఈ వాస్తవ పరిస్థితుల్లో బాధాకరం ఏమిటంటే ఈ జలగ నాయకులు వీరు పనిచేయరు – ఎవరన్నా చేస్తుంటే వారిపై రకరకాలుగా విష ప్రచారాలు చేసి వారిని పార్టీకి దూరం చేసి పరోక్షంగా వై.సి.పి కి మేలుచేసే కార్యాచరణ తీసుకోవటం దుర్మార్గం, అన్యాయం, పార్టీకి అత్యంత ప్రమాదకరం..
ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితిలో విషయం ఉన్న నాయకులు, కష్టపడి పనిచేసే నాయకులు, మంచి వాళ్ళు, నిజాయితీపరులు, నిబద్ధత ఉన్నవాళ్ల అవసరం చాలా ఉంది కనుక పార్టీ శ్రేయోభిలాషులు గా మేము కోరుకుంటున్నది ఒక్కటే
వ్యక్తిగతంగా వారి వారి కక్షలను ఈర్ష్యలను తీర్చుకోవడానికి.. కష్టపడి పార్టీ కోసం పనిచేసే నాయకులను పార్టీ నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న నిజమైన కోవర్టు నాయకుల భరతం పట్టి ఈ చీడను పూర్తిగా ఏరివేసి... నిజాయితీ గల నాయకులకు పార్టీ అధినాయకత్వం అండ,దండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనవిచేస్తూ… అధిష్టానం ఇకనైనా ప్రజాక్షేత్రంలో నిరంతరాయంగా పనిచేస్తున్న నాయకులపై ఇటువంటి విషప్రచారాన్ని చేస్తున్న కలుపుమొక్కలను ఏరివేసి రాబోవు రోజుల్లో ఒంగోలు నియోజక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దడానికి సన్నద్ధం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇట్లు
తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరుకునే ఓ బాధ్యతాయుత కార్యకర్త
జై D J..జై చంద్రబాబు..జై జై తెలుగుదేశం

అవసరమైతే న్యాయపోరాటం.. రావుల పద్మజ

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *