హైకోర్టు తీర్పు హర్షణీయం
అమరావతిని అభివృద్ది చేయాలి
కందుకూరును ప్రకాశంలోనే ఉంచాలి
ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు
రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రకాశం జిల్లా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాజధాని అమరావతిలో ఉంటే కృష్ణా, గుంటూరు తరువాత దగ్గరగా ఉన్న ప్రకాశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లా వాసుల ఆశాకిరణాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్, దొనకొండ పారిశ్రామిక కారిడార్, రామాయపట్నం పోర్టులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులోనూ హేతుబద్దత లేకుండా పోయింది. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపటం వల్ల రామాయపట్నం పోర్టు తరలిపోతుంది. ఎన్నో దశాబ్దాలుగా పోర్టు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు..ఎన్నో ఆందోళన చేశారు..ఇపుడు పోర్టు పొరుగు జిల్లాకు తరలిపోయే పరిస్థితి లేకుండా జిల్లాల పునర్విభజన హేతుబద్దంగా ఉండేలా ప్రభుత్వం అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని కోరారు.