జనసేనలోకి కంది రవిశంకర్
ఈనెల 18న ముహూర్తం
తన వియ్యంకుడు కిలారి రోశయ్యతో కలిసి
పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిక
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం
ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రవిశంకర్ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 18న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. తన వియ్యంకుడు, సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో పాటు రవిశంకర్ జనసేనలో చేరనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తో దగ్గర పరిచయమున్న రవిశంకర్ జనసేనలో చేరటంపై ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరువాత ఉమారెడ్డికి ప్రాధాన్యత తగ్గించటంపై ఆయనతో పాటు ఆయన అల్లుడు రోశయ్య కినుక వహించారు. అంతేకాకుండా తనకే మాత్రం ఇష్టం లేకపోయినా పొన్నూరు సిట్టింగ్ స్థానం నుంచి తప్పించి గుంటూరు లోక్ సభ బరిలో నిలబెట్టటంపైనా రోశయ్య తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రోశయ్య త్వరలో జనసేనలో చేరుతున్నారన్న సమాచారం గుంటూరు జిల్లాలో వ్యాప్తిలో ఉండగానే ప్రకాశం జిల్లాలో రవిశంకర్ చేరిక వార్త రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. కాపు సామాజికవర్గానికి చెందిన రవిశంకర్ కు ఒంగోలులో అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తగా గుర్తింపు ఉంది. వివాదరహితునిగా పేరుంది. రవిశంకర్ జనసేనలో చేరటాన్ని అందరూ కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఆయన త్వరలో జనసేనలో కీలక పదవి చేపట్టనున్నట్టు కూడా ప్రచారం కొనసాగుతుంది.