రెడ్ అలర్ట్ .. తీవ్ర తుపానుగా బలపడ్డ అర్నబ్ తుపాన్
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అర్నబ్ తీవ్రతుపానుగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందన్నారు. ప్రస్తుతానికి గోపాల్పూర్(ఒడిశా) 490 కి.మీ, విశాఖపట్నంకు 490 కి.మీ, కాకినాడకు 560 కి.మీ, మచిలీపట్నంకు 660 కి.మీ, బాపట్లకు 730 కి.మీ దూరంలో ఉందని రానున్న 12 గంటల్లో అతి తీవ్రతుపాను’గా బలపడి రేపు సాయంత్రం వరకు ఇది పశ్చిమ-వాయువ్య దిశగానే పయనించి, ఆ తర్వాత వాయువ్య దిశగా మలుపు తీసుకుంటుందని వివరించారు. ఎల్లుండి ఉదయానికి బాపట్ల -విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115-125 కి.మీ గరిష్టంగా 140 కి.మీ వరకు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి విస్తారంగా వర్షాలు, చెదురుమదురుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కోస్తా తీరం వెంబడి 90-100కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెట్లు, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని హెచ్చరించారు.
మంగళవారం (27-10-2026) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ; పల్నాడు, ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
బుధవారం (28-10-2026) :
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ; పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వ పరంగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రజలను ఆందోళన చెందకుండా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే 8 ఎస్డీఆర్ఎఫ్ , 7ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని అదనంగా 3ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా నుంచి వచ్చిన 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఫైర్ డిపార్టమెంట్ కు చెందిన 115 ఉడ్ కటింగ్ , 13 బోటు రెస్క్యూ బృందాలు 76 ఆస్కా లైట్స్, 853 లైఫ్ బోయ్స్, 1328 లైఫ్ జాకెట్స్ తో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
20 జిల్లాలకు సహాయ నిధులు విడుదల
తుపాను భద్రత సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలకు తరలింపు, త్రాగునీరు, ఆహారం, పాలు, హెల్త్ క్యాంపుల నిర్వహణ, శానిటేషన్ , రోడ్లు, మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ 27 కింద మొత్తం రూ.27 కోట్ల నిధులను మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇందులో భాగంగా బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ. 2 కోట్ల చొప్పున (రూ. 14 కోట్లు); ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ. 1 కోటి చొప్పున (రూ. 13 కోట్లు) కేటాయించినట్లు వివరించారు.

