ముఖ్యమంత్రిగా జగన్ అనర్హుడు
ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయ్
ఫ్లోరిడాలో టీడీపీ మహానాడు
ఫ్లోరిడా(అమెరికా), డిసెంబర్ 4: జగన్ ముఖ్యమంత్రిగా అనర్హుడని జయరాం కోమటి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ మహానాడు కార్యక్రమం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ విభాగం కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తోబట్టువులే ఆయనను దోషిగా ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టారు. ఇక్కడున్న పాలకులపై నమ్మకం లేక, చట్టబద్ధ పాలన లేదని బాబాయి హత్యకేసును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేసింది. రాష్ట్రంలో ఎంత అరాచక, చట్ట వ్యతిరేక పాలన సాగుతోందో సుప్రీంకోర్టు నిర్ణయంతో స్పష్టమైంది. జగన్ రెడ్డి అవినీతి, అరాచకాలకు భయపడి అనేక కంపెనీలు తరలిపోయాయి. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రవాసాంధ్రులు సైతం పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబు సభలకు జనం పోటెత్తడంతో జగన్ రెడ్డి భయపడుతున్నారు. కందకాలు తవ్వినా, బారికేడ్లు కట్టి పోలీసులు అడ్డుకున్నా జనం పారిపోతున్నారు. అందుకే ప్రజలను బతిమలాడుతున్నారన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ, కార్మిక, ఇతర అనేక శాఖ మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి వారికి కొమ్ముకాస్తున్నారు. 42 నెలల పాలనలో విశాఖలో రూ.40వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రతి కార్యక్రమంలో కమీషన్లు వసూలు చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. తక్షణమే అవినీతి మంత్రులను భర్తరఫ్ చేయాలన్నారు. తనకు, జగన్ రెడ్డికి సంబంధం లేదని తల్లి విజయ మాట్లాడటం రాష్ట్ర ప్రజలను మోసగించడమే. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ మాట్లాడూతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. తెలుగువారికి ఇంతటి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఎన్టీఆర్ తెలుగుజాతి ఉన్నంతకాలం వారి మదిలో చిరస్మరణీయుడిగా ఉంటారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీపడిన ఏపీ… నేడు పేకాట, జూద కేంద్రాల ఏర్పాటులో పోటీ పడుతోంది. ఉద్యోగ, ఉపాధి లభించక యువత తీవ్రంగా నష్టపోతోంది. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చంద్రబాబు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసే వరకు ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.
గుత్తికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి. ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో చేస్తున్నటువంటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, తమ పరిచయాలు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేలా ఉండాలన్నారు. సంఘటితంగా పోరాడి రాష్ట్రంలో రాక్షసపాలనను అంతమొందించాలన్నారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారుముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పిన్నమనేని, నాగేంద్ర తుమ్మల, అశోక్ యార్లగడ్డ, సుధీర్ వేమూరి, అజయ్ దండమూడి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుమంత్ రామినేని, సుధాకర్ మున్నంగి, వేణుబాబు నిమ్మగడ్డ, నరేన్ కొడాలి, శ్రీనాథ్ రావుల తదితరులు పాల్గొన్నారు.