జనసేనలో చేరిన ఆదికేశవులు నాయుడు మనవరాలు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా విశేష సేవలందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత డి.కె.ఆదికేశవులు నాయుడుమనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
డి.కె.ఆదికేశవులు నాయుడు గారు పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా వేలాదిమందికి ఉపాధి కల్పించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర విస్మరించలేనిది. లోక్ సభ సభ్యుడిగా ప్రజా జీవితంలోకి వచ్చిన ఎన్నో సేవలు చేశారు. టి.టి.డి. బోర్డు ఛైర్మన్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు హిందూ ధార్మిక పరిరక్షణకు పాటుపడ్డారు. శ్రీ ఆదికేశవులు నాయుడు గారి కుమార్తె శ్రీమతి తేజస్విని గారి కుమార్తె శ్రీమతి చైతన్య. ఈమె తమ ట్రస్టు ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను జనసేన ద్వారా మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. పార్టీలో చేరిన సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేస్తూ తాతగారి బాటలో అడుగులు వేయాలని సూచించారు. శ్రీ డి.కె.ఆదికేశవులు నాయుడు గారు సమాజ అభివృద్ధికి ఎంతగానో తపించారని, అదే విధంగా టి.టి.డి. బోర్డు ఛైర్మన్ గా ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.