ఒంగోలు నుంచి శిద్దా

గిద్దలూరుకు వెళ్లనున్న బాలినేని
సీఎం నుంచి సంకేతాలు
పార్టీలో హాట్ టాపిక్ గా మారిన తాజా పరిణామాలు
రానున్న ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున శిద్దా సుధీర్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్ కుమార్ మంగళవారం నాడు సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా ఒంగోలు నుంచి పోటీపై సంకేతాలు అందినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే శిద్దా పేరు ఖాయమయ్యే అవకాశం ఉంది. ఒంగోలు నుంచి సుధీర్ కుమార్ ను బరిలోకి దింపాలా, రాఘవరావునే పోటీలో ఉంచాలనే విషయమై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాను ఒంగోలు నుంచే పోటీచేస్తానని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో శిద్దా పేరు అనూహ్యంగా తెరమీదకు రావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా రెండు సార్లు మంత్రి గా పనిచేసిన బాలినేనికి స్థానచలనం కలిగిస్తున్నారన్న ఆలోచనను ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి బాలినేనిని గిద్దలూరు నుంచి పోటీకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై బాలినేని ఆచితూచి స్పందిస్తున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించటంపై కొంతకాలంగా బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన రాజకీయ వైఖరిపై అనేక ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒంగోలు నుంచి పోటీకి శిద్దాను రెడీ చేయటం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.