ap news

జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం

• 20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు
• ఉప ముఖ్యమంత్రి నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
• 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు
• అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్ సాంకేతికత

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యాలతో ఆయన ప్రారంభించిన సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం నిర్దేశిత లక్ష్యంలో 85 శాతం వరకు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమాజాలు, ఎన్జీవోలు, వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు sunaru 2.06 కోట్ల సీడ్ బాల్స్ ను వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మూలపాడు ఎకో పార్క్ లో మొదటి విత్తన బంతిని తయారు చేసి అధికారులు, ప్రజల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తి 2.82 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి బీజం వేసింది. ఉప ముఖ్యమంత్రివర్యుల సూచనలకు అనుగుణంగా స్వదేశీ, బహుళ ప్రయోజన జాతుల వృక్షాలకు చెందిన విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్‌లో మెజారిటీ భాగాన్ని క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు వినియోగించారు. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఇప్పటి వరకు 20,929 హెక్టార్ల విస్తీర్ణంలో సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేశారు. అటవీ అంచుల్లో క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది, సరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.

హెలికాప్టర్ నుంచి సీడ్ బాల్స్ వెదజల్లుతున్న దృశ్యం

అటవీ ప్రాంతాల్లో వర్షపాతం కొంత మెరుగవడంతో మానవ వనరులు అడుగుపెట్టలేని అడవుల మధ్య ప్రాంతాల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాలను డ్రోన్ల సాయంతో గుర్తించి సీడ్ బాల్స్ వెదజల్లారు. ప్రాంతాల వారీగా భౌగోళిక పరిస్థితుల అనుకూలతల ఆధారంగా విత్తనాలను ఎంపిక చేశారు. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సీడ్ బాల్స్ తయారీ, రవాణా, విస్తరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలన్న లక్ష్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అటవీ అధికారులు ముందుకు తీసుకువెళ్తున్నారు.
సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియ సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో, అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమానికి కొనసాగింపుగా వెదజల్లిన ప్రాంతాల్లో మొలకల శాతం, మొక్కల ఎదుగుదల తదితర అంశాలపై కూడా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *